- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వెల్లడించారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో చెప్పడానికి ఈ కొనుగోళ్లే నిదర్శనమన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 334 కొనుగోలు కేంద్రాల ద్వారా 4,29,921 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించిన రూ. 1,018 కోట్ల 62 లక్షలను ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ రబీలో సుమారు 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించినట్లు వివరించారు. అలాగే, పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 5,800 మంది రైతుల నుంచి 26,443 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
మరో 14 వేల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణానికి
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా, రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకూ కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచుకునేందుకు వీలుగా, పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విజయరమణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లిలో గిడ్డంగుల సంస్థ ద్వారా 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాము పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, సింగిల్ విండో ఆధ్వర్యంలో మరో 14 వేల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు చెప్పారు. త్వరలోనే ఓదెల మండలంలో 20 వేల మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్‌లో 2 వేలు, పెద్దపల్లి మండలంలో 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.
బీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్..
ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు అనవసర విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చుక్క నీరు కూడా రాలేదని, గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కెనాల్ ద్వారానే ఇక్కడి భూములు సస్యశ్యామలం అవుతున్నాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోయాయని, ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగా శాస్త్రీయంగా మేడిగడ్డ రిపేర్ పనులు చేపడుతోందని గుర్తుచేశారు. ప్రాజెక్టులపై అవగాహనతో సలహాలు ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ఆహ్వానించినా.. వారు రాలేదని విమర్శించారు. అనంతరం.. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను ఇంత పకడ్బందీగా విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్‌కు, ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులకు, వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సారయ్య గౌడ్, నాయకులు సమా రాజేశ్వర్ రెడ్డి, రాండి తిరుపతి రెడ్డి, కొమ్మ పోచాలు, శ్రీగిరి శ్రీనివాస్, అరె సంతోష్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






