రీ-సర్వేతో భూములకు భరోసా.. వివాదాలకు శాశ్వత చెక్!

by Ramesh Naini |

జగిత్యాల జిల్లాలో భూముల హద్దులపై స్పష్టత తీసుకురావడం, పాత రికార్డుల్లోని లోపాలను సరిదిద్దడం, భూ వివాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ ప్రారంభమైంది.

రీ-సర్వేతో భూములకు భరోసా.. వివాదాలకు శాశ్వత చెక్!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో భూముల హద్దులపై స్పష్టత తీసుకురావడం, పాత రికార్డుల్లోని లోపాలను సరిదిద్దడం, భూ వివాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ధర్మపురి, మల్లాపూర్ , బీర్‌పూర్ మండలాల్లో సర్వే చేపట్టారు. అయితే ఈ మూడు మండలాల పరిధిలోని 20 గ్రామాలకు నక్ష లేని కారణంగా మొదటి విడతలో అధికారులు ఆయా గ్రామాల్లో నక్ష సర్వేతో పాటు రీ సర్వే చేపట్టారు. కొడిమ్యాల, మల్యాల మండలాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి 'భూదార్' పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించే ప్రక్రియ అమల్లోకి రానుంది.

గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన

జగిత్యాల జిల్లాలోని 20 మండలాల్లో ప్రతి మండలానికి మూడు నుంచి నాలుగు రెవెన్యూ గ్రామాల్లో చొప్పున రీసర్వే కోసం ఎంపిక చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ధర్మపురి, కోరుట్ల, బీర్పూర్ మండలాల్లో గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించి పనులు మొదలుపెట్టారు. కొడిమ్యాల, మల్యాల మండలాల్లో ఇప్పటికే రెవెన్యూ సర్వే శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించిన అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. 70 గ్రామాలను క్లస్టర్లుగా విభజించిన అధికారులు విడతలవారీగా సర్వే పనులను పూర్తి చేయనున్నారు.

జిల్లాలో కొత్త టెక్నాలజీతో రీ-సర్వే

గతంలో ఉన్న సర్వే రికార్డులు, భూముల విభజనలు, క్రయవిక్రయాల కారణంగా అనేక చోట్ల హద్దులపై స్పష్టత లేకపోవడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను కొలిచి ఖచ్చితమైన హద్దులను నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత తాజా మ్యాపులు, డిజిటల్ రికార్డులు సిద్ధం చేయనున్నారు. అయితే రీ-సర్వేతో భూములు కోల్పోతామనే ప్రచారం జిల్లాలో కొన్ని గ్రామాల్లో జరుగుతున్నప్పటికీ, ఇందులో నిజం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పట్టా పాస్‌బుక్‌లో నమోదైన వివరాలను భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులతో సరిపోల్చి కచ్చితమైన రికార్డులు సిద్ధం చేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని వివరిస్తున్నారు.

సాదా బైనామాలపై రాని స్పష్టత..!

జిల్లాలో సాదా బైనామాల ఆధారంగా సాగవుతున్న భూములు గణనీయంగా ఉన్నాయని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రీ-సర్వేతో వాటికి చట్టబద్ధత వస్తుందా అనే సందేహం రైతుల్లో ఉంది. అయితే రీ-సర్వే అనేది కేవలం భూమి హద్దులను గుర్తించి రికార్డులను నవీకరించే ప్రక్రియ మాత్రమేనని, యాజమాన్య హక్కులను మార్చదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం సాదా బైనామాల క్రమబద్దీకరణపై ప్రత్యేక నిర్ణయం తీసుకుంటే, రీ-సర్వేలో నమోదయ్యే వివరాలు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో రైతులకు కలిగే ప్రయోజనాలు

*భూమి హద్దులపై స్పష్టత

*సరిహద్దు వివాదాలు తగ్గే అవకాశం

*పట్టా, మ్యాప్, విస్తీర్ణం ఒకే రికార్డులో నమోదు

*ఆక్రమణలను గుర్తించడం సులభం

*రుణాలు, రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు వేగవంతం

*ప్రతి భూమికి ప్రత్యేక భూధర్ నంబర్

*భూ లావాదేవీల్లో పారదర్శకత

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

*సర్వే జరిగే సమయంలో తప్పనిసరిగా భూమి వద్ద ఉండాలి

*పట్టాదారు పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి

*అధికారులు చూపిన హద్దులను జాగ్రత్తగా పరిశీలించాలి

*ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి

*రీ-సర్వే పూర్తయ్యాక రికార్డులను తప్పనిసరిగా పరిశీలించి ధృవీకరించుకోవాలి

Next Story