- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ లో అరుదైన శస్త్ర చికిత్స..4 కిలోల కణితి తొలగింపు
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది.

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ మహిళ కడుపు నుంచి సుమారు 4 కిలోల బరువున్న భారీ కణితిని (ట్యూమర్) వైద్యులు శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా తొలగించి ప్రాణాలు కాపాడారు.
దీర్ఘకాలిక నొప్పితో నరకయాతన..
హన్మకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల కొమరమ్మ అనే మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. రోజురోజుకూ కడుపు ఉబ్బిపోతుండటం, నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి రావడంతో స్థానికంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించింది. అయితే అక్కడ పరీక్షల నిమిత్తం, ఆపరేషన్ కోసం భారీగా ఖర్చవుతుందని చెప్పడంతో.. అంత ఆర్థిక స్తోమత లేక ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మెరుగైన చికిత్స నిమిత్తం ఆమె హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ (ఏరియా) ఆసుపత్రిని ఆశ్రయించింది.
రంగంలోకి దిగిన నిపుణుల బృందం..
ఆసుపత్రికి వచ్చిన కొమరమ్మకు వైద్యులు స్కానింగ్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో ఒక భారీ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉండటంతో తక్షణమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందం శుక్రవారం ఉదయం ఈ క్లిష్టమైన సర్జరీని ప్రారంభించింది. గంటలపాటు శ్రమించిన వైద్య బృందం.. రోగి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, అత్యంత జాగ్రత్తగా సుమారు 4 కిలోల బరువున్న భారీ కణితిని బయటకు తీశారు.
రోగి పరిస్థితి నిలకడగా ఉంది...
"శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం సదరు మహిళా రోగి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. ఆమె వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తాం." అని ఆర్ ఎం ఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
వైద్య బృందానికి ప్రశంసల జల్లు..
ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఇలాంటి అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను ఉచితంగా, విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని డిసిహెచ్ కృష్ణ ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఇక్కడ మరిన్ని క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుటుంబంలో వెలుగులు నింపిన వైద్యులకు, ప్రభుత్వానికి బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.






