ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా మరో మాట చెప్పను.. సీఎంకు హరీశ్ రావు కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-10 13:44:06  IST  )

తాను బీఆర్ఎస్ లోకి మారబోతున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు స్పందించారు.

ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా మరో మాట చెప్పను.. సీఎంకు హరీశ్ రావు కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హరీశ్ రావు బీజేపీ నేతలతో టచ్‍లో ఉన్నారని ఈ విషయం నిజమో కాదో రాముడిపై ఒట్టేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. 'రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు. 20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు' అన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సీఎంపై విమర్శలు గుప్పించారు.

నీ ప్రమాణం ఏమైంది?:

భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన నీ ప్రమాణం ఏమైంది? అని రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా? అని నిలదీశారు. ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు? అని మండిపడ్డారు. కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అని 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా? అన్నారు.

చంద్రబాబుకు కప్పం:

ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారిందన్నారు. ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోందని దుయ్యబట్టారు. ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.

తెలంగాణ రైతాంగానికి నమ్మక ద్రోహం

కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం అని ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం అన్నారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం అన్నారు. నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుందన్నారు.

చీకటి ఒప్పందం ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నదని, నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్‌లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటన్నారు. ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి? అని నిలదీశారు. కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది? తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు? గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదని ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 టీఎంసీ, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 టీఎంసీ, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీ, రామగుండం STPP కోసం 6.50 టీఎంసీ, NTPC కోసం 4.73 టీఎంసీ మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 టీఎంసీ, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 టీఎంసీ కేటాయింపులు ఉన్నాయన్నారు. డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? అన్నారు.

జిల్లా మంత్రులు ఏం చేస్తున్నట్లు?

ప్రమాద ఘంటికలు మోగుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యం. ప్రజల అవసరాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎగువ గోదావరిలో కొద్దిపాటి వరదలు కూడా రాలేదు. ఎస్సారెస్పీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కూడా ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేవు. ఎగువ గోదావరిలో ఇలాంటి లోటు ప్రవాహాలు ఉన్న కరువు కాలంలో దిగువ గోదావరిలో లక్ష క్యూసెక్కుల నీరు వృథా గా కిందకు వెళ్ళిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దిగువ గోదావరిలో లభ్యమవుతున్న నీటిని ఒడిసి పట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గోదావరిలో వరద లేదని, వానలు లేవని ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టిసీమలో 24 మోటార్లు నిరంతరాయంగా ఎలా నడుస్తున్నాయి? గోదావరిలో వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తోంది రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు. దేవాదుల నుంచి కిందికి వెళ్తున్న గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేయడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారు? రైతులకు నీళ్లు అందించే బాధ్యత గుర్తు లేదా? పదవులు ఉన్నవి అనుభవించడానికేనా లేక ప్రజలకు సేవ చేయడానికా? అని నిలదీశారు. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ సహా ఇతర అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.

Next Story