మల్లాపూర్‌లో మక్క రాజకీయం : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు!

by Naga Rani Yarlagadda |

మల్లాపూర్‌లో ఆధిపత్య పోరుకు మక్కల కేంద్రం అడ్డాగా మారింది.

మల్లాపూర్‌లో మక్క రాజకీయం : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు!
X

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మక్కల కొనుగోలు కేంద్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధిపత్య పోరుకు అడ్డాగా మారింది. అధికారులు ప్రోటోకాల్ సాకుతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడంపై ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల గైర్హాజరీలో ఎమ్మెల్యే కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, పది రోజుల పాటు తూకం వేయకుండా నిలిపివేశారు. తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్ సమక్షంలో అధికారులు రెండోసారి ప్రారంభోత్సవం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ రాజకీయ వివాదాల వల్ల పది రోజులుగా మక్కలను అమ్ముకోలేక రైతులు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నారు. మక్క పంట చేతికి వచ్చి నెల గడిచినా కొనుగోళ్లు సాగకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మార్క్ ఫెడ్ ఎండీని కలిసిన రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఎట్టకేలకు తూకం ప్రక్రియ ప్రారంభమైంది.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రం రాజకీయ వివాదాలకు వేదికైంది. టెంటు, కుర్చీలు వేసి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఈ నెల 9న కేంద్రాన్ని ప్రారంభిస్తామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కు సమాచారం అందించారు. జిల్లా మార్క్ ఫెడ్ అధికారులు సైతం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. అయితే, సరిగ్గా ప్రారంభానికి గంట ముందు అధికారులు వ్యూహాత్మకంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే సంజయ్, ‘రైతులతో చెలగాటమాడొద్దు’ అని అధికారులను హెచ్చరిస్తూ, అధికారుల ప్రమేయం లేకుండానే అదే రోజున బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే హాజరైన ఈ కార్యక్రమానికి అధికారులు ఎవరూ రాకపోవడం గమనార్హం.

పది రోజుల జాప్యం.. రెండోసారి ప్రారంభం..

ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభించినా అధికారులు సహకరించకపోవడంతో పది రోజుల పాటు తూకం ప్రక్రియ ముందుకు సాగలేదు. కేవలం ప్రోటోకాల్ వివాదం కారణంగానే తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రారంభించి పది రోజులు గడిచిన తర్వాత, గురువారం రోజున మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలత నర్సయ్య ఆధ్వర్యంలో అధికారులు మళ్లీ అదే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు రాని అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాగానే హాజరుకావడం వెనుక ఉన్న రాజకీయ సంకేతాలపై స్థానికంగా చర్చ నడుస్తోంది. పది రోజులుగా తూకం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ రాజకీయ పోరు శాపంగా మారింది.

రైతుల ఆందోళన.. పట్టించుకోని అధికార యంత్రాంగం

మక్క పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై మాజీ పీఏసీఎస్ చైర్మన్ చిట్టాపూర్ నేరెళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు జిల్లా మార్క్ ఫెడ్ ఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఎండ తీవ్రతకు మక్కలు ఎండిపోయి బరువు తగ్గుతున్నాయని, మరోవైపు దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతుల్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి వెంటనే తూకం వేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story