నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

by Taduka Kalyani |

జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్‌ను అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.

నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్‌ను అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి శాస్త్రీయ ఆధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్ వంటి సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. దొంగతనం కేసులను అత్యంత ప్రాధాన్యం గా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరితగతిన ఛేదించి, దొంగిలించిన సొత్తును బాధితులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, రవీందర్, మొగిలి, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story