- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎన్‌ఏలో డేటా నిల్వ.. 24 ఏళ్ల యువతి అద్భుత ఆవిష్కరణ!
ప్రపంచమంతా డేటా స్టోరేజ్ సమస్యను పరిష్కరించడానికి పెద్ద పెద్ద డేటా సెంటర్లు నిర్మిస్తుంటే, అనఘా రాజేశ్ మాత్రం పూర్తిగా కొత్త మార్గం ఆలోచించింది!

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఇంటర్నెట్ మానవ జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. అనేక రంగాలు, అనేక వ్యవస్థలు, అనేక పనులు దానిపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంటర్నెట్ లేనిదే మనుగడ లేదు. వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ వినియోగం కారణంగా స్టోరేజ్ వ్యవస్థలు సైతం సరిపోవడం లేదనే ఆందోళన కొంతకాలంగా వ్యక్తం అవుతోంది. అయితే దీనికి చక్కటి పరిష్కార మార్గాన్ని ఆలోచించింది 24 ఏళ్ల భారతీయ యువతి అనఘా రాజేశ్. డీఎన్‌ఏలో నిల్వ చేసే సాంకేతికతను ఆమె అభివృద్ధి చేస్తున్నది. ఇంతకీ అదెలా సాధ్యం అనుకుంటున్నారా? లెట్స్ గో అండ్ రీడ్!
తక్కువ శక్తి.. ఎక్కువ నిల్వ
సాధారణ హార్డ్ డ్రైవ్‌లు, డేటా సెంటర్లకంటే కూడా డీఎన్ఏ స్టోరేజ్ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని, ఇది చాలా చిన్న ప్లేస్‌లో ఎక్కువ డేటా నిల్వ చేయగలదని అనఘా రాజేశ్ (Anagha Rajesh) భావిస్తున్నది. అంతేకాకుండా ఇది చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుందని చెబుతోంది. ప్రస్తుతం ఆమె తన BioCompute అనే స్టార్టప్ ద్వారా ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. లక్నోలో పుట్టి పెరిగిన ఈ యువతి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(BITS) పిలానీలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఇన్ కెమిస్ట్రీ (2020-2024) చదివింది.
2024లో BioCompute స్టార్టప్‌ను స్థాపించింది. గత రెండేళ్లలో ఈ సంస్థ ₹5 కోట్లకు పైగా ఫండింగ్ సమకూర్చుకుని, ల్యాబ్ సెటప్ చేసి, ప్రోటోటైప్ తయారు చేస్తున్నది. కాగా అనఘా రాజేశ్ ప్రస్తుతం ఈ కంపెనీని సాన్ ఫ్రాన్సిస్కో (USA)కి మార్చి, డీఎన్ఏ( DNA) డేటా స్టోరేజ్ చిప్స్ అభివృద్ధి చేస్తున్నది. ఇండియాలో డీప్ టెక్ కోసం సరైన ఫండింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నది.
సరికొత్త మార్పునకు దారి
ఒకవైపు ప్రపంచమంతా డేటా స్టోరేజ్ సమస్యను పరిష్కరించడానికి పెద్ద పెద్ద డేటా సెంటర్లు నిర్మిస్తుంటే, అనఘా రాజేశ్ మాత్రం పూర్తిగా కొత్త మార్గం ఆలోచించింది. డీఎన్‌ఏలో డేటా నిల్వ చేయడం ద్వారా భవిష్యత్తులో సర్వర్లు కాకుండా, జీవసంబంధమైన వ్యవస్థలలో డేటా భద్రపరచవచ్చునని భావించింది. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే డేటా స్టోరేజ్ రంగం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డీఎన్‌ఏ స్టోరేజ్- పనితీరు
డీఎన్‌ఏ డేటా స్టోరేజ్ అంటే.. సింథటిక్ డీఎన్‌ఏ (ల్యాబ్‌లో తయారు చేసిన DNA మాలిక్యూల్స్)ను ఉపయోగించి డేటా నిల్వ చేసే ప్రాసెస్. ఇక్కడ బైనరీ కోడ్ (0s & 1s) నుంచి డీఎన్‌ఏ బేస్‌లు (A, C, G, T)గా మార్చి సంగ్రహిస్తారు. దానిని తర్వాత అవసరమైనప్పుడు తిరిగి రీడ్ చేసి డేటా తీసుకుంటారు. ఇది చాలా చిన్న స్థలంలో భారీ డేటా నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అయితే ప్రస్తుతం అనఘా రాజేశ్ డెవలప్ చేస్తున్న ఈ స్టోరేజ్ మాత్రం మొదటిదశలో సానుకూల ఫలితాలపై నమ్మకాన్ని పెంచుతోందని, ఈ ప్రయత్నం భవిష్యత్ డేటా విప్లవానికి మార్గం చూపుతోందని అభిప్రాయపడుతున్నారు. సాంప్రదాయిక పద్ధతులకు బదులుగా జీవసాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించాలనే ఆమె ఆలోచన, ఆవిష్కరణ భవిష్యత్ సాంకేతికతకు, సృజనాత్మకతకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.






