2027లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. ఢిల్లీ చిట్‌చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-15 13:14:26  IST  )

ఢిల్లీలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన చిట్‌చాట్ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

2027లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. ఢిల్లీ చిట్‌చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమేనని, కేసీఆరే (KCR) మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మీడియాతో ఆసక్తికరంగా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పరిపాలన, తన భవిష్యత్తు కార్యాచరణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు సర్వేల్లో బీఆర్ఎస్‌దే విజయం

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి పోయిందని కేటీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణ (Telangana)లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న పచ్చి నిజం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఇటీవల 3 ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలలోనూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే తిరిగి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైన నివేదికలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గుర్రం విలువ ఏంటనేది గాడిదను చూసిన తర్వాతే తెలుస్తుంది. అలాగే చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ ఏంటో అర్థమవుతుంది’అంటూ గత కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పేరిట తెలంగాణ ప్రజలను హింసిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఎంట్రీపై క్లారిటీ

తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను వెల్లడిస్తూ.. 2027లో రాష్ట్రవ్యాప్తంగా తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారనే అంశంపై స్పందిస్తూ.. రావాలనుకున్నప్పుడు కేసీఆర్ కచ్చితంగా ప్రజల మధ్యకు వస్తారని స్పష్టం చేశారు. ఆయనకు ఎలాంటి అభద్రతాభావం లేదని, సరైన సమయంలో ఆయన రంగంలోకి దిగుతారని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story