అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వినుకొండ యువతి దుర్మరణం

by Vemula.Srinu Prasad |

ఉన్నత చదువుల కోసం కలల దేశం అమెరికాకు వెళ్లిన ఓ యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన విద్యార్థిని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వినుకొండ యువతి దుర్మరణం
X

దిశ, వినుకొండ: ఉన్నత చదువుల కోసం కలల దేశం అమెరికాకు వెళ్లిన ఓ యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన విద్యార్థిని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటనతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సాధారణ రైతు మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె మక్కెన ప్రసన్న (27) ఉన్నత విద్య అభ్యసించేందుకు 2022లో అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ (MS) పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దె కారులో ఓ కార్యక్రమానికి హాజరైంది. అయితే, తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితులకు గాయాలయ్యాయి.

కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు..

చేతికొచ్చిన బిడ్డ, ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందనుకున్న ప్రసన్న.. ఇక లేదని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువతి మరణ వార్తతో ఉమ్మడివరం గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేలా ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు.

పరామర్శించిన ఎమ్మెల్యే జీవీ

ప్రసన్న మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యువతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి, వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.

Next Story