- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆషాఢ బోనాలకు వేళాయే.. అంగరంగ వైభవంగా నేటి నుంచి ఉత్సవాలు
తెలంగాణ ప్రజల ఆరాధ్య పండుగ అయిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి.

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ ప్రజల ఆరాధ్య పండుగ అయిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత బోనాలను అధికారిక పండుగగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3,427 దేవాలయాలకు రూ.15,45,41,150 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.
నేడు జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ..
గురువారం ఉదయం లంగర్‌హౌస్ ఎక్స్‌రోడ్డు వద్ద కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మొదటి రోజే సుమారు లక్షన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లంగర్‌హౌస్ నుంచి వైభవంగా ఊరేగింపు..
లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ప్రదర్శనలు, బాజాభజంత్రీల నడుమ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దారిపొడవునా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు..
ప్రతి ఏడాది ఆనవాయితీగా ప్రధాన అర్చకుడు అనంతాచారి నివాసంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోల్కొండ, చోటాబజార్, బడాబజార్ మీదుగా ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. మహిళలు బోనాలు సమర్పించడం, పోతురాజుల విన్యాసాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మెట్లకు బొట్లు.. ప్రారంభమైన పండుగ సందడి..
బోనాల ప్రారంభానికి సంకేతంగా బుధవారం గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లు పెట్టి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సంప్రదాయంతో బోనాల సందడి ప్రారంభమైంది.
పటిష్ట భద్రత – ట్రాఫిక్ ఆంక్షలు..
బోనాల సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గోల్కొండ, లంగర్‌హౌస్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సెలింగ్ నిర్వహించారు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బోనాల ప్రధాన తేదీలు..
జూలై 16: గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ప్రారంభం
జూలై 20: బల్కంపేట ఎల్లమ్మ ఎదుర్కోలు ఉత్సవం
జూలై 21: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
జూలై 22: బల్కంపేట రథోత్సవం
ఆగస్టు 2: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు
ఆగస్టు 3: రంగం కార్యక్రమం
ఆగస్టు 9: లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు
ఆగస్టు 10: ఘటాల సామూహిక ఊరేగింపు సందర్భంగా ప్రభుత్వ అధికారిక సెలవు
ఆగస్టు 13: గోల్కొండలో చివరి బోనంతో ఉత్సవాల ముగింపు.






