మట్టి మాఫియాతో కుమ్మక్కైన అధికారులను వదలం!

by Ratna Kumari |

మట్టి మాఫియాతో కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులతో పాటు, వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

మట్టి మాఫియాతో కుమ్మక్కైన అధికారులను వదలం!
X

దిశ, పెద్దపల్లి : మట్టి మాఫియాతో కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులతో పాటు, వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కనుసన్నల్లోనే మట్టి మాఫియా తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తోందని వారు ఆరోపించారు. జిల్లాలో ఇసుక, మట్టి మాఫియాకు ఎమ్మెల్యే డాన్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఎన్ని చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయి, ఎంత మట్టి తవ్వడానికి అనుమతులిచ్చారు, తవ్వకపు విధానం ఏంటి? తదితర వివరాలపై ఏ ఒక్క అధికారి వద్దా సరైన సమాచారం లేదన్నారు. మట్టి తవ్వకాలను అసలు ఏ శాఖ పర్యవేక్షిస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిని జిల్లా కలెక్టర్ సృష్టించారని వారు విమర్శించారు.

లోకల్ వే బిల్లులతో భారీ మోసం..

మట్టిని తరలిస్తున్న లారీల వద్ద కేవలం లోకల్ వేబిల్లులు మాత్రమే ఉంటున్నాయని, అయినప్పటికీ అవి జిల్లా సరిహద్దులు దాటి అక్రమంగా తరలిపోతున్నాయని సంజీవరెడ్డి, సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మట్టి ద్వారా సమకూరే ఆదాయంలో 25 శాతం గ్రామ పంచాయతీకి, 50 శాతం మండలానికి, మిగతాది జిల్లా పరిషత్‌కు కేటాయించాల్సి ఉన్నప్పటికీ, ఆ నిధులు సంబంధిత ఖాతాల్లో జమ కాకుండా పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో మట్టి మాఫియా రాజ్యమేలుతోందని, అక్రమార్కులు చెరువులు, కుంటలకు గండ్లు పెట్టి మరీ మట్టిని అమ్ముకుంటూ రైతుల కంట కన్నీటికి కారణమవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి భారీ స్థాయిలో మట్టిని తరలిస్తున్నా సంబంధిత శాఖాధికారులు కానీ, పోలీసు యంత్రాంగం కానీ చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాటాలు పంచుకున్న తోడుదొంగలు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు ఇద్దరూ తోడుదొంగలని వారు విమర్శించారు. గతంలో మట్టి, ఇసుక అక్రమాలపై ఒకరిపై ఒకరు తొడలు కొట్టిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు వాటాలు పంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వాటాల్లో తేడాలు రావడంతోనే బహిరంగంగా తిట్టుకుంటున్నారని ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ మట్టిని పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీజ్ చేసిన అక్రమ లారీల వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు, ప్రజలకు అండగా నిలబడి బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్, కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్, సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు బెజ్జంకి దిలీప్ కుమార్, రామగిరి అఖిల్, బొడ్డుపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story