- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తిపాకలో మరో క్రషర్‌కు ‘నో’… గుట్టలపై కన్నేస్తే ఊరుకోం!
శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో మరో కొత్త స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న సన్నాహాలపై గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దిశ, శాయంపేట : శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో మరో కొత్త స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న సన్నాహాలపై గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో నడుస్తున్న క్రషర్ వల్ల ఒక పెద్ద గుట్ట పూర్తిగా కనుమరుగైందని.. ఇప్పుడు మరో గుట్టను లక్ష్యంగా చేసుకుని కొత్త క్రషర్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయం పై శుక్రవారం పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ జంగారెడ్డి, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు లిఖితపూర్వకంగా సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామంలో ఉన్న పాత క్రషర్ కారణంగా ఒక సహజసిద్ధమైన గుట్ట పూర్తిగా తవ్వి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గుట్ట అడుగు భాగం వరకు తవ్వి పాతాళాన్ని తలపించేలా మార్పులు చేసినట్లు ఆరోపించారు. అలాగే మరో గుట్ట పై క్రషర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతుండటం గ్రామ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.పాత క్రషర్, డాంబర్ ప్లాంట్ కారణంగా గ్రామంలో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, తరచూ జరుగుతున్న బ్లాస్టింగ్స్ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, రైతుల పొలాలు, ప్రకృతి వనరులు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కొత్త క్రషర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని స్పష్టం చేస్తూ, ఇప్పటికే కొనసాగుతున్న పాత క్రషర్‌ను కూడా తక్షణమే నిలిపివేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పత్తిపాక గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామ ప్రయోజనాలను పక్కనబెట్టి క్రషర్ యాజమాన్యానికి సహకరించే ఏ నాయకుడైనా తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని హెచ్చరించారు. ప్రకృతిని కాపాడుకోవడానికి, రైతుల పొలాలను రక్షించుకోవడానికి గ్రామ ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.






