నిధులున్నా నిర్వేదం.. చెక్ పవర్ లేక సర్పంచుల సతమతం

by I. Sairam |

గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.

నిధులున్నా నిర్వేదం.. చెక్ పవర్ లేక సర్పంచుల సతమతం
X

​దిశ, హుజూరాబాద్ రూరల్: గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కానీ ఆ ఉత్సాహం గడప దాటకముందే సర్పంచులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. గత నెల 22న ఎంతో ఆర్భాటంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఇప్పుడు 'చెక్ పవర్' లేకపోవడం శాపంగా మారింది. నిధులున్నా ఖర్చు చేసే అధికారం లేక, ఊరి సమస్యలు చూస్తూ ఊరుకోలేక సర్పంచులు సతమతమవుతున్నారు.​గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం పంచాయతీ నిధుల నిర్వహణ అంతా ఆన్‌లైన్ కావడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.​రాష్ట్ర నిధుల వినియోగం కోసం 'ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌'లో సర్పంచుల పేర్లు నమోదు కావాల్సి ఉంది. కేంద్ర నిధుల కోసం ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో కొత్త వివరాలు అప్‌డేట్ కావాలి. ట్రెజరీ అధికారులు సర్పంచ్, ఉప సర్పంచుల వేలిముద్రలు సేకరించి, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, డిజిటల్ కీలను కేటాయించాలి. ఈ ప్రక్రియ ఇంకా జిల్లా యంత్రాంగం వద్దే పెండింగ్‌లో ఉండటంతో చెక్ పవర్ బదలాయింపు జరగడం లేదు.

​సొంత డబ్బులు ఖర్చు పెట్టలేక..

​గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి పైపులైన్ల లీకేజీలు వంటివి అత్యవసరమైనవి. వీటి కోసం పది రోజులు కూడా వేచి చూసే పరిస్థితి ఉండదు. నిధుల డ్రా అధికారం లేకపోవడంతో సర్పంచులు తమ సొంత జేబుల నుంచి పనులు చేయించాల్సి వస్తోంది.​‘సర్పంచ్ గారూ.. మా వీధిలో లైట్లు వెలగడం లేదు, పైపులైన్ పగిలి నీళ్లు వృథా అవుతున్నాయి అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అధికారులు వెంటనే కీలు ఇవ్వకపోతే పాలన మొత్తం స్తంభిస్తుంది’ అని హుజూరాబాద్ మండల పరిధిలోని ఓ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా వారి చేతుల్లోనే!..

​గత రెండేళ్లుగా సాగిన ప్రత్యేక అధికారుల పాలన ముగిసి, ఎన్నికైన ప్రతినిధులు వచ్చినా అధికారం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే సాగుతోంది. నిధుల విడుదల కోసం ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని దీనివల్ల పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే పంచాయతీ ఖాతాల్లో ఉన్నాయి. కేవలం 'డిజిటల్ కీ' అందకపోవడం వల్లే ఆ నిధులు ప్రజలకు అందడం లేదు. ​జిల్లా పంచాయతీ అధికారులు ట్రెజరీ అధికారులతో సమన్వయం చేసి క్యాంపుల ద్వారా డీఎస్​సీ నమోదు పూర్తి చేయాలని పేర్కొంటున్నారు.​టెక్నికల్ గ్లిచ్‌లను సరిచేసి వారం రోజుల్లోగా సర్పంచులకు పూర్తి అధికారాలు కల్పించాలని,​అత్యవసర పనుల కోసం మధ్యంతర ఏర్పాట్లు చేయాలని,​అధికారం చేతికి వచ్చినా, అది 'చెక్' వరకు చేరకపోవడంతో కొత్త సర్పంచులు ఎప్పుడెప్పుడు తమ మార్కు పాలన చూపిద్దామా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిస్తే గ్రామాల్లో అభివృద్ధి అంత త్వరగా పరుగులు తీస్తుంది.

Next Story