వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం

by Ajay Maddhiboyina |

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. పర్యవేక్షణ లోపంతో కొంతమంది ఉద్యోగులు ప్రైవేట్​సేవలకు ప్రాధాన్యతను ఇస్తుండగా మరికొంత మంది వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నీరు గారుస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం
X

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. పర్యవేక్షణ లోపంతో కొంతమంది ఉద్యోగులు ప్రైవేట్​సేవలకు ప్రాధాన్యతను ఇస్తుండగా మరికొంత మంది వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నీరు గారుస్తున్నారు. ప్రభుత్వం ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇస్తున్న వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. ఇది ఏ మారు మూల ప్రాంతమో లేక జిల్లా సరిహద్దుల్లో అనుకుంటే పొరపాటే సాక్ష్యాత్తు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పనితీరు ఈ విధంగా ఉండటం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

క్యారియర్ లో ఉండాల్సిన వ్యాక్సిన్ క్యారియర్ పైన

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో శనివారం అక్కడ పనిచేసే సిబ్బంది ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. అయితే ఆ వ్యాక్సిన్లు నిర్థిష్ట ఉష్ణోగ్రతలో (సాధారణంగా 2’C -8’C) లో నిల్వ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు క్యారియర్ పైన పెట్టి వ్యాక్సినేషన్ చేశారు. ఇప్పటికే జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఈ సమయంలో ఆ వ్యాక్సిన్ ను క్యారియర్ పైన పెట్టి వ్యాక్సినేషన్ వేయడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అలా ఎక్కువ సేపు క్యారియర్ బయట నిల్వ ఉంచడం వల్ల సహజంగా ఆ వ్యాక్సిన్ దాని శక్తిని కోల్పోతుంది. తద్వార ప్రభుత్వం ఏ ఉద్దేశం తోనైతే ముందస్తుగా వ్యాక్సినేషన్ అందిస్తుందో ఆ లక్ష్యం నీరుకారిపోతుంది. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి లేకపోలేదు. అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వ్యాక్సినేషన్ నిర్వహించాల్సిన సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యనహరిస్తూ వ్యాక్సినేషన్ చేయడం వల్ల ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరకపోగా వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి లేకపోలేదు.

పర్యవేక్షణ లోపంతో విధుల్లో నిర్లక్ష్యం

వైద్య ఆరోగ్య శాఖ పనితీరు పై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యంపై కోట్ల రూపాయలు హెచ్చిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడంతో క్రింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న తిమ్మాపూర్ మండలంలోనే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఇలా ఉంటే ఇక మారు మూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వ జీతాలు ప్రయివేటు సేవలు

తిమ్మాపూర్ మండలం లో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే కొంతమంది సిబ్బంది తమ విధులను విస్మరిస్తూ ప్రయివేటు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తిమ్మాపూర్ మండలం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటం ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు స్థానికంగా ఉండకుండా జిల్లా కేంద్రం నుంచి విధులు నిర్వర్తించడంతో వారు వచ్చిన రోజే వైద్యసేవలు వారు రాకుంటే అడిగేవారు ఉండకపోవడంతో కొంతమంది సిబ్బంది ప్రయివేటు ఆస్పత్రుల్లో సేవలు అందిస్తూ వారి వాట్స్ ఆప్ లో స్టేటస్​లు పెట్టుకుంటుండటం ఇక్కడి అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

Next Story