వెక్కిరిస్తున్న ఆట స్థలాలు.. క్రీడలు లేని.. క్రీడా ప్రాంగణాలు

by Bhanu |

గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల పరంగా ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.

వెక్కిరిస్తున్న ఆట స్థలాలు.. క్రీడలు లేని.. క్రీడా ప్రాంగణాలు
X

దిశ, కొడిమ్యాల: గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల పరంగా ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అయితే సరైన ఆట స్థలాలను ఎంపిక చేయడంలో విఫలమైన అధికారులు తూతూ మంత్రంగా క్రీడా ప్రాంగణాలను నెలకొల్పారు. స్మశానాలు, గుట్ట ప్రాంతాలు, రాళ్లు రప్పలతో ఉన్న వాటిని సైతం క్రీడా ప్రాంగణాలుగా గుర్తించి బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కొన్నిచోట్ల గ్రామ పరిధిలో స్థలం లేకపోవడంతో వేరే గ్రామ శివారులలో ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల గ్రౌండ్లలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు నెలకొల్పారు. అయితే ఇందులో 90 శాతానికి పైగా క్రీడా ప్రాంగణాలు ఆటగాళ్లను వెక్కిరిస్తున్నట్లుగా మారాయి. అసలు ఎలాంటి ఆటలకు అణువుగా లేకపోవడంతో కేవలం అలంకారప్రాయంగా మాత్రమే మిగిలిపోయాయి.

నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఆట స్థలాలు.

గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు విషయంలో అప్పటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యమే. అయితే అధికారుల నిర్లక్ష్యం ఆటగాళ్ళకు శాపంగా మారింది. అసలు ఏమాత్రం ఆటలకు అనువుగా లేని స్థలాలను ఎంపిక చేయడం పట్ల క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనువైన స్థలాలు లేనప్పుడు ప్రభుత్వానికి సరైన నివేదిక ఇవ్వకుండా స్మశానాలు, గుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్పితే ఒక్క ఆటగాడికి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే సరైన ఆట స్థలాలను గుర్తించి గ్రామీణ క్రీడా ప్రాంగణాలు గా ఏర్పాటు చేస్తే పల్లె ప్రాంతంలోని యువత తో పాటు వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఉపయోగపడేవనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

మూలన పడ్డ ఆట వస్తువులు

గత అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో చాలా వరకు క్రీడా ప్రాంగణాలకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసినప్పటికీ వాటిని బయటకు తీసి ఆడిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. దీంతో క్షేత్ర స్థాయిలో క్రీడా ప్రాంగణాల లక్ష్యం ఆచరణకు ఆమడ దూరంలోనే ఆగిపోయింది. కొన్ని మాత్రమే ఆటలకు అనువైన స్థలాలు ఉండగా ప్రభుత్వం పంపిణీ చేసిన క్రికెట్ కిట్లు, వాలి బాల్ వంటి స్పోర్ట్స్ మెటీరియల్ మాత్రం కనపడకుండా పోయాయి. అసలు ప్రభుత్వం పంపిణీ చేసిన ఆట వస్తువులు ఉన్నాయా? మాయమాయ్యాయా?ఉంటే ఎవరి ఆదీనంలో ఉన్నాయి? అనేది కూడా తెలియని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల అయితే కోకో, కబడ్డీ ఇతరత్రా ఆటలకు ఏర్పాటు చేసిన పోల్స్, ఐరన్ సామాగ్రి దొంగల పాలైంది.

ఊరికి దూరంగా క్రీడా ప్రాంగణాలు

గత పాలకులు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు చాలా చోట్ల ఊరికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల రాళ్లు గుట్టల సమీపంలో నిర్మించడం వలన క్రీడా కారులు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రభుత్వం ఏ ఉద్దేశ్యం తో అయితే గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.

అందుబాటు లోకి తీసుకు రావాలి : చొక్కాల నాగార్జున (క్రీడా కారుడు)

మండలంలోని వివిధ గ్రామాల్లో క్రీడలపై ఆసక్తి చూపించే యువకులు విద్యార్థులు చాలా మంది ఉన్నారు. సరైన సదుపాయాలు కల్పిస్తే ఉత్తమ ప్రతిభ కనబరిచే నైపుణ్యం ఆటగాళ్ళలో ఉంది. కానీ వారిని ప్రోత్సాహించేందుకు ప్రాక్టీస్ చేయడానికే సరైన ఆట స్థలాలు లేవు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే ఆటగాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు స్పందించి ఆట స్థలాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయాలి.

Next Story