ఎస్ఆర్ఆర్ కాలేజీలో అవినీతి: దీక్షకు సిద్ధమైన విద్యార్థిని

by Naga Rani Yarlagadda |

ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి విద్యార్థులను సక్రమార్గంలో నడిపించాల్సిన ఎస్ఆర్ఆర్ కాలేజీ అధ్యాపకులు సంతకానికి సర్కారు నౌకరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తవుతున్నాయి.

ఎస్ఆర్ఆర్ కాలేజీలో అవినీతి: దీక్షకు సిద్ధమైన విద్యార్థిని
X

దిశ బ్యూరో, కరీంనగర్ : విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన అధ్యాపకుల్లో అలసత్వం అడుగడుగునా పేరుకు పోతుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో సర్టిఫికెట్లు మాయమైన విషయం వెలుగులోకి రావడంతో తప్పును సరిదిద్దుకోవాల్సిన సిబ్బంది అది పక్కకు పెట్టి సమాచారం ఎలా బయటకు వచ్చింది అంటూ ఆరా తీయడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. పేపర్లో వస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటూ బాధితురాలిని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. దీంతో అసలు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏం జరుగుతుందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

సంతకానికే నౌకరి

ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి విద్యార్థులను సక్రమార్గంలో నడిపించాల్సిన ఎస్ఆర్ఆర్ కాలేజీ అధ్యాపకులు సంతకానికి సర్కారు నౌకరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తవుతున్నాయి. కాలేజీలో చేరిన విద్యార్థులకు క్రమశిక్షణ, దేశ భక్తి, సామాజిక స్పృహ లాంటి ప్రత్యేక శిక్షణ పేరిట ఎన్‌సీసీలో చేక్చుకుంటున్న అధ్యాపకులు ఆపై వృత్తి ధర్మాన్ని నిర్వర్తించకుండా గాలికి వదిలేసి బాధ్యతలు సీనియర్లకు అప్పగిస్తున్నారని తెలుస్తుంది. దీంతో రెచ్చిపోతున్న సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరిట వేధించి హింసించే వారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాలేజీలో చేరిన సంపంగి అఖిల అనే విద్యార్థిని ఎన్‌సీసీలో చేరిన నాటి నుంచి సీనియర్లు వేధించి చెప్పినట్టు వినడం లేదనే భావనతో విద్యార్థిని ఏడిపించేందుకు చేసిన ఆకతాయి వ్యవహారంతో సర్టిఫికెట్లు కాలేజీ ఆఫీసు కార్యాలయం నుంచి తస్కరించినట్లు తెలుస్తుంది.

బాధ్యతా రాహిత్యంగా కాలేజీ సిబ్బంది

ఎస్ఆర్ఆర్ కాలేజి విద్యార్థిని సంపంగి అఖిల కాలేజీలో తన సర్టిఫికెట్లు కానరాకపోవడంతో కంగారు పడి అధ్యాపకుల ముందు కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకపోవడంతో సమస్యను పరిష్కరించుకునేందుకు దిశ ప్రతినిధిని సంప్రదించగా.. దిశ వాస్తవ కథనాన్ని విద్యార్థిని ఆవేదనను వెలుగులోకి తెచ్చింది. అయితే సమస్యను పరిష్కరించి బాధితురాలికి అండగా నిలువాల్సిన అధ్యాపకులు అది విస్మరించి విషయం ఎలా బయటకు వచ్చిందనే సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక శ్రద్ధను చూపడం వివాదాస్పదమై వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుంది.

పేపర్లో వస్తే సర్టిఫికెట్ దొరుకుతుందా?

సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థిని ఓదార్చి సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇవ్వాల్సిన కాలేజ్ ప్రిన్సిపాల్ ఎన్‌సీసీ కో ఆర్డినేటర్ విద్యార్థికి ఫోన్ చేసి కాలేజీ పరువు తీశావంటూ అసహనం వ్యక్తం చేయడంతో విద్యార్థిని ఆందోళనకు గురౌతోంది. పేపర్లో వస్తే నీ సర్టిఫికెట్లు వస్తాయా? మా దగ్గరే పోయిందని రాసి ఇస్తాం పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకో అంటూ తీసిపారేసినట్లుగా వ్యవహరించడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సర్టిఫికెట్లు పోవడానికి కారణమైన ఎన్‌సీసీ కో ఆర్డినేటర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కాలేజీ ఎదుట దీక్షకు దిగుతా - సంపంగి అఖిల, బాధిత విద్యార్థిని

తన సర్టిఫికెట్లు తనకు అప్పగించకపోతే ఎస్‌ఆర్ఆర్ కాలేజీ ఎదుట దీక్షకు దిగుతా. అక్రమంగా సర్టిఫికెట్లు తీసుకున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి తన ఆవేదనకు కారణమైన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి. సర్ది చెప్పాల్సిన ఎన్‌సీసీ కో ఆర్డినేటర్ పేపర్లో వస్తే సర్టిఫికెట్లు వస్తాయా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు కేసుకు ఖర్చులు ఇస్తానంటూ మాట్లాడటంపై తనకు న్యాయం జరిగే వరకు కాలేజీ ఎదుట నిరసన చేపడుతా.

Next Story