ఇష్టాను సారంగా నేషనల్​హైవే పనులు..కానరాని సర్వీస్​రోడ్లు, అండర్​పాస్​లు

by Ajay Maddhiboyina |

రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్ర రాజధానులతో పల్లెలకు అనుసంధానం కల్పించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో జాతీయ రహదారులను నిర్మిస్తోంది.

ఇష్టాను సారంగా నేషనల్​హైవే పనులు..కానరాని సర్వీస్​రోడ్లు, అండర్​పాస్​లు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్ర రాజధానులతో పల్లెలకు అనుసంధానం కల్పించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో జాతీయ రహదారులను నిర్మిస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నారు. పలుచోట్ల నిర్మాణ పనులను అడ్డుకుని నిరసనలు తెలుపుతున్నారు.జాతీయ రహదారి నిర్మాణం కోసం తమ విలువైన భూములను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, పరిసర గ్రామాలకు అవసరమైన అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుండానే రహదారి నిర్మాణాన్ని కొనసాగిస్తుండటంతో కరీంనగర్ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణం వివాదాస్పదంగా మారుతోంది.

కానరాని అండర్‌పాస్‌లు.. సర్వీస్ రోడ్లు

జగిత్యాల నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారి పొడవునా అనేక గ్రామాలు ఉన్నప్పటికీ, ప్రతి గ్రామానికి అవసరమైన అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అధికారులు కొన్ని గ్రామాలకు సర్వీస్ రోడ్లు, మరికొన్ని గ్రామాలకు అండర్‌పాస్‌లను విస్మరించి రహదారి నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటికే ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని, జాతీయ రహదారి పూర్తయి వాహనాల రాకపోకలు మరింత పెరిగితే గ్రామాల ప్రజలు రహదారిని దాటే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కిలోమీటర్ల మేర కానరాని యూ-టర్న్‌లు

జాతీయ రహదారి వెంట అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడంతో పాటు సరిపడా యూ-టర్న్‌లు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రహదారి పక్కనే ఉన్న గ్రామాలకు వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర ప్రయాణించి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువయ్యాయని వారు అంటున్నారు. విలువైన వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులు, మిగిలిన భూములకు వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే కనిపిస్తున్న తమ పొలంలోకి వెళ్లాలంటే మరో గ్రామానికి వెళ్లి తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని, మిగిలిన భూములను సాగు చేయాలా, అమ్ముకోవాలా అన్న సందిగ్ధ పరిస్థితి నెలకొందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తున్న రహదారి నిర్మాణం

దేశవ్యాప్తంగా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మిస్తోంది. అయితే జగిత్యాల–వరంగల్ జాతీయ రహదారి నిర్మాణంలో అధికారుల అలసత్వం కారణంగా వందల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చలేక ప్రజాగ్రహానికి గురవుతోంది. తమ విలువైన భూములను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, రహదారి నిర్మాణంలో కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలకు సరైన కనెక్టివిటీ లేక, జాతీయ రహదారిపై ఎక్కాలన్నా, దిగాలన్నా కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు అత్యవసరమైనప్పటికీ, భూములు ఇచ్చేందుకు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నా నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని గ్రామాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఇబ్బందులు కలగకుండా భూసేకరణకు వెనుకాడుతూ అధికారులు వ్యవహరిస్తుండటంతో రహదారి నిర్మాణం వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి జాతీయ రహదారి నిర్మాణ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో జగిత్యాల–వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతోంది.

Next Story