జగిత్యాల ఎమ్మెల్యే బ‌రిలో ఎంఐఎం అభ్య‌ర్థి !

by velandi.Saikiran |   (  Updated:2026-02-08 01:33:02  IST  )

జగిత్యాలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం (MIM) రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే బ‌రిలో ఎంఐఎం అభ్య‌ర్థి !
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం (MIM) రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిలగడ్డ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసి మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల తర్వాత జగిత్యాలకు వచ్చానని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

జగిత్యాలలో ఉర్దూ హౌస్ భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల గంజ్ ప్రాంతంలో ఉన్న నాలా సమస్య, అలాగే ఉర్దూ హౌస్ ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఓవైసి స్పష్టం చేశారు.రాజకీయంగా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ముస్లింలకు సరైన నాయకత్వం ఇవ్వలేదని విమర్శించారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్న పార్టీలు, ముస్లిం సమస్యలను పార్లమెంటులో ఎప్పుడూ ప్రస్తావించలేదని ఆరోపించారు.

“వందేమాతరం చదవండి… అర్థం చేసుకోండి” అంటూ వ్యాఖ్యానించారు. తాను నాయకత్వం వహిస్తే ఎందుకు ఇంత కోపమని ప్రశ్నించిన ఓవైసి, కాంగ్రెస్ పార్టీలోనే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ఇద్దరూ పరస్పరం కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో మాత్రం ఎప్పుడు పోరాడతారని నిలదీశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ, అమిత్ షా ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదని, అలాంటి పరిస్థితిలో జగిత్యాలలో బీజేపీ ఎలా గెలుస్తుందంటూ ప్రశ్నించారు. 2028 ఎన్నికల్లో జగిత్యాలలో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెడతామని అసదుద్దీన్ ఓవైసి ప్రకటించారు.మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో ఎంఐఎం పార్టీ నుంచి 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించి, ప్రజల సమస్యల పరిష్కారానికి బలమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story