బీజేపీ‌లోకి ఆహ్వానిద్దామా? ఎంపీ అర్వింద్ స్పెషల్ ఇంట్రెస్ట్

by velandi.Saikiran |   (  Updated:2026-03-17 21:30:56  IST  )

జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ప్రపోజల్‌ను అర్వింద్.. రాష్ట్ర నాయకత్వం ముందు ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బీజేపీ‌లోకి ఆహ్వానిద్దామా? ఎంపీ అర్వింద్ స్పెషల్ ఇంట్రెస్ట్
X

బీజేపీ‌లోకి ఆహ్వానిద్దామా?

- జీవన్ రెడ్డికోసం ఎంపీ అర్వింద్ స్పెషల్ ఇంట్రెస్ట్

- ఎమ్మెల్యే సంజయ్ వల్లే గొడవలు: జీవన్ రెడ్డి

దిశ, జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ప్రపోజల్‌ను రాష్ట్ర నాయకత్వం ముందు ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగిత్యాల కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అర్వింద్ పలు సందర్భాల్లో జీవన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చుతుంది. కాంగ్రెస్‌పై అసంతృప్తితో రగులుతున్న జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావులతో అర్వింద్ చర్చించినట్టు సమాచారం. జీవన్ రెడ్డి నిజంగానే జాతీయ పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేక మరో పార్టీలో చేరతారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

మాకు నీతులు చెబుతారా?

జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోవాలని తాను కోరుకోవడం లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన కామెంట్స్‌పై జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రస్తుత సమస్యకు కారణమని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో ముందు తెలుసుకోవాలని ఆ తర్వాత కలిసి పని చేయడం గురించి ఆలోచిద్దామని అన్నారు. అసలు తాను పార్టీని వీడాలనుకోవడానికి మూల కారణం ఎమ్మెల్యేనేనని, నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని ఎవరు వదులుకోవాలని కోరుకోరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు స్పీకర్ తేల్చారని అలాంటప్పుడు తనతో కలిసి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.

కట్టుబడి ఉంటా

అలాగే కలిసి పనిచేయడం అంటే పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదని జీవన్ రెడ్డి హితవు పలికారు. కలిసి పని చేస్తున్నాననే నెపంతో పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్‌తో కలిసి అభివృద్ధి కొరకు పనిచేశానని, నాలుగు దశాబ్దాలుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ పార్టీని బలోపేతం చేయడం కోసం సిన్సియర్‌గా పనిచేశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఉడుము లాగా వచ్చి చిచ్చు పెట్టడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించుకుంటూ మాకు నీతులు చెప్పటం ఏమిటి అని నిలదీశారు. తాను ఎక్కడ ఉన్న అంకిత భావంతో చేస్తానని, ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానని, అది కాలమే నిర్ణయిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు.

Next Story