- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం...నక్సలైట్ ల తల్లి మృతి
నక్సల్స్ గోపగాని ఐలన్న, కుమారస్వామిల తల్లి గోపగాని కొమరమ్మ (92) మృతి చెందారు. ఆమె మరణంతో తుమ్మనపల్లి గ్రామంలో విషాద

దిశ, హుజురాబాద్ రూరల్ ; నక్సల్స్ గోపగాని ఐలన్న, కుమారస్వామిల తల్లి గోపగాని కొమరమ్మ (92) మృతి చెందారు. ఆమె మరణంతో తుమ్మనపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక కుమారుడిని గ్రెనేడ్ ప్రమాదంలో కోల్పోయి, మరో కుమారుడు కిడ్నాప్ కావడంతో 37 ఏళ్లుగా అతని కోసం ఎదురుచూసిన ఈ వీరమాత కోరిక నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కొమరమ్మ స్వగ్రామమైన తుమ్మనపల్లిలో గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణం గ్రామస్తులను, కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచింది.
గోపగాని కొమరమ్మకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఇద్దరు కుమారులు గోపగాని ఐలన్న, గోపగాని కుమారస్వామి నాటి పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. గోపగాని కుమారస్వామి అలియాస్ రవన్న 1979లో కమలాపూర్ మండలం, గూడూరులో ఏర్పడిన తొలి దళంలో సభ్యునిగా చేరారు. దళంలో పనిచేస్తున్న సమయంలోనే గ్రెనేడ్ ప్రమాదంలో ఆయన మరణించారు. మరో కుమారుడు, గోపగాని ఐలన్న, పీపుల్స్ వార్ పార్టీకి ఉత్తర తెలంగాణ రీజనల్ కార్యదర్శిగా పనిచేశారు. 1988లో హైదరాబాద్ నగరంలో ఆయన అదృశ్యమయ్యారు. ఇది పీపుల్స్ వార్ వర్గాల ప్రకారం కిడ్నాప్ ఘటన. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియలేదు.
కిడ్నాప్ కు నిరసనగా పీపుల్స్ వార్ ప్రతీకార చర్యలు...
ఐలన్న కిడ్నాప్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నేడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు నిరసనగా అప్పటి పీపుల్స్ వార్ పార్టీ నేడు మావోయిస్టు పార్టీ పలు చర్యలకు దిగింది. మొదట, మంథని ఎంపీపీ కిషన్ నాయక్, అనంతరం కమాన్‌పూర్ ఎంపీపీ రామచంద్ర గౌడ్‌లను కిడ్నాప్ చేసి తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత తాడిచెర్ల ఎంపీపీ మలహల్ రావును కిడ్నాప్ చేసి, ప్రభుత్వం స్పందించకపోవడంతో నక్సలైట్లు కాల్చి చంపారు. ఒక ఎంపీపీని నక్సలైట్లు హతమార్చడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అనంతరం ప్రభుత్వం ఐలన్న కిడ్నాప్‌పై ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిషన్ రిపోర్ట్‌ను తొక్కిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐలన్న కిడ్నాప్‌కు అప్పటి డీఐజీ వ్యాసే కారణమని పీపుల్స్ వార్ పార్టీ భావించి, ఆయనను హైదరాబాద్‌లో కాల్చి చంపినట్లు అప్పట్లో ప్రకటించింది. ఇన్ని సంఘటనలకు మూల కారణం గోపగాని ఐలన్న కిడ్నాప్ కావడమే. తన కొడుకు ఐలన్న కోసం దాదాపు నాలుగు దశాబ్దాలుగా కళ్లల్లో వత్తులు వేసుకుని చూసిన కొమరమ్మ, అతని ఆచూకీ తెలియకుండానే మరణించడం విషాదకరం. ఐలన్న సోదరుడు గోపగాని లింగన్న ప్రస్తుతం సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ వీరమాతకు పలువురు ప్రముఖులు, ప్రజలు నివాళులర్పించారు. ఆమె ధైర్యం, త్యాగం చిరస్మరణీయం అని వారు కొనియాడారు.






