- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ జిల్లాలో 50 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, వచ్చేవారం లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటి వరకు రైతులకు 237 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, వచ్చేవారం లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటి వరకు రైతులకు 237 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లు ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సీజన్ లో 3.61 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామని అన్నారు. ఇప్పటికీ 3 లక్షల ఒక వెయ్యి మెట్రిక్ టన్నులు కొనుగోళ్ల కోసం వచ్చిందని తెలిపారు.
వచ్చిన ధాన్యం నుంచి ఒక లక్ష 58 వేల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశామని, రైతులకు సంబంధించి రూ. 237 కోట్లు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. రానున్న వారంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికతో ఉన్నామని అన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ సజావుగా సాగేలా చూడాలని తెలిపారు. రానున్న రెండు వారాలు మరింత కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి హమాలీల సమస్య ప్రధానంగా కనిపిస్తోందని, లోకల్ హమాలీలను ప్రోత్సహిస్తూ ఈ సమస్యను అధిగమించాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణాకు సంబంధించి పూర్తిస్థాయిలో అధికారాలు ఇచ్చామని, లారీ అసోసియేషన్ ప్రతినిధులు సహకరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూసుకోవాలని, జిల్లా పంచాయతీ అధికారి హమాలీల సమస్య పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ధాన్యం లోడు పూర్తయిన ప్రతి వాహనం 24 గంటల్లోగా మిల్లులో అన్లోడ్ అయ్యేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎక్కువ పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేస్తూ ఇంటర్మీడియట్ గోదాములను స్టోరేజీ కోసం వినియోగించాలని సూచించారు. మిల్లర్లకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని, అదే రీతిలో రబీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు అధికారులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తనీయవద్దని అన్నారు. కరీంనగర్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 50% కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో ముందున్నామని తెలిపారు. వారం రోజుల్లోనే 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మరో వారంలో లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపుల విషయంలోనూ జిల్లా ముందు వరుసలో ఉందని తెలిపారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఒక లక్ష 58 వేల 382 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు 78% ఆన్లైన్లో నమోదు పూర్తయిందని తెలిపారు. 88% ధాన్యం మిల్లర్లు స్వీకరించారని అన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం రజనీకాంత్ పాల్గొన్నారు.






