- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రీయ విద్యాలయం చుట్టూ రాజకీయం.. ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్!
జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన స్థల ఎంపిక అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. చల్‌గల్ వలంటరీ సెంటర్ పరిధిలోని రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన స్థల ఎంపిక అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. చల్‌గల్ వలంటరీ సెంటర్ పరిధిలోని రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఐదు ఎకరాలు కావాలని తెలిసి కూడా తక్కువ స్థలాన్ని ప్రతిపాదించడం వెనుక ఎమ్మెల్యే కుట్ర ఉందన్నారు. చల్‌గల్‌లోనే పూర్తి ఐదు ఎకరాలు కేటాయించాలని కోరుతూ ఎంపీ అరవింద్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎమ్మెల్యే సంజయ్ తన అనుకూల భూముల విలువ పెంచుకునేందుకే నర్సింగాపూర్ ఐటీఐ పరిసరాలను చూపిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ విషయంలో విద్యాసంస్థ ఏర్పాటు కంటే ఇరు పార్టీల నాయకుల ఆధిపత్య పోరాటమే ఎక్కువవడంతో ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- దిశ, జగిత్యాల ప్రతినిధి
దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అంశం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. విద్యాసంస్థ ఏర్పాటు కంటే ఇప్పుడు స్థల ఎంపిక చుట్టూనే అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధంగా మారిన ఈ వివాదం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రీయ విద్యాలయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని చల్‌గల్ వాలంతరీ సెంటర్ ఆధీనంలో ఉన్న రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వివాదానికి తెరలేచింది.
రెండు ఎకరాలపై ఎంపీ అభ్యంతరం...
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కనీసం ఐదు ఎకరాల భూమి అవసరమని స్పష్టమైన నిబంధనలు ఉన్న నేపథ్యంలో, కేవలం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడం ఏమిటని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదు ఎకరాలు అవసరమని తెలిసినా ఉద్దేశపూర్వకంగానే రెండు ఎకరాల ప్రతిపాదన పంపించి కేంద్రీయ విద్యాలయం ఇక్కడికి రాకుండా తిరస్కరణకు గురయ్యేలా కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కనీస రోడ్డు సౌకర్యాలు కూడా సరిగ్గా లేని ప్రాంతాన్ని ఎంపిక చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి లేఖ..
ఇదే సమయంలో చల్‌గల్ గ్రామ శివారులోని వాలంతరీ సెంటర్ పరిధిలో ఉన్న పూర్తి ఐదు ఎకరాల భూమినే కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని కోరుతూ ఎంపీ అరవింద్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న భూముల విలువ పెంచుకునేందుకే నర్సింగాపూర్ ఐటీఐ కళాశాల పరిసర ప్రాంతాన్ని ముందుకు తెస్తున్నారని ఎంపీ ఆరోపించడం కలకలం రేపుతోంది. మరోవైపు ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులు, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన మరికొందరు నాయకులు కలిసి నర్సింగాపూర్ శివారులో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలు...
ఎమ్మెల్యే వర్గం మాత్రం విద్యార్థుల రాకపోకలకు అనువైన ప్రాంతంలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సమర్థించుకుంటోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ స్థల వివాదం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అసలు ఎప్పుడు పూర్తవుతుందో అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఇరు పార్టీల నాయకుల రాజకీయ ఆధిపత్య పోరాటమే ఇక్కడ ముందుకు వస్తోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.






