- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే సంజయ్ కమర్షియల్ కరప్టెడ్ లీడర్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పొలిటికల్ ఎథిక్స్ లేని కమర్షియల్ కరప్టెడ్ లీడర్ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పొలిటికల్ ఎథిక్స్ లేని కమర్షియల్ కరప్టెడ్ లీడర్ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో కె.వి స్థల అంశంపై ఎంపీ ఘాటుగా స్పందించారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలం ఎంపిక విషయంలో ఎమ్మెల్యే కావాలనే రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేవీ ఏర్పాటు కు ఐదు నుంచి పది ఎకరాల స్థలం అవసరమని కేంద్ర నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ చెల్గల్ వద్ద ఉన్న వాలంతరీ సెంటర్‌లో రెండు ఎకరాలే కేటాయించారని అరవింద్ మండిపడ్డారు. ఇది తిరస్కరణకు గురవుతుందని తెలిసే ఆ ప్రతిపాదన పంపించారని ఆరోపించారు. “కేవీ కోసం సరైన కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ ఉండాలి. పిల్లలు, తల్లిదండ్రులు సౌకర్యంగా చేరుకునే ప్రాంతంలోనే పాఠశాల ఉండాలి” అంటూ స్పష్టం చేశారు.
రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేని ఐటీఐ సమీప ప్రాంతంలో కేవీ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “అకాడమిక్ ఇయర్ ఆలస్యమైనా పరవాలేదు.. కానీ మంచి ప్రాంతంలోనే కేంద్రీయ విద్యాలయం నిర్మించి తీరుతాం” అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఈగో కారణంగా పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.పైసల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ ని రాజకీయంగా నగ్నంగా చేసే వరకు వదిలిపెట్టం.. స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయట పెడతాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. బిజెపి కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం పై పోలీసుల తీరును తప్పుబట్టిన ఎంపి ఐఏఎస్, ఐపీఎస్ లు చదివి రాజకీయ పార్టీలకు కొమ్ము కాయడం సరికాదన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బిజెపి రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుప్ రావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






