​హుజురాబాద్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

by Kodari Anjali |

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం హుజురాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

​హుజురాబాద్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ,​ హుజురాబాద్ రూరల్: "నిండు జీవితానికి రెండు చుక్కలు... ప్రతి చిన్నారికి పోలియో రక్షణ" అనే నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం హుజురాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుమార్తె శ్రీనిక రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఆయన ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

​పోలియో రహిత సమాజమే లక్ష్యం... -ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పోలియో మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ​"రెండు చుక్కల మందు... మీ పిల్లల జీవితానికి శ్రీరామరక్ష. ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి" అని ఆయన సూచించారు.

​ఏరియా ఆసుపత్రి తనిఖీ...

​పోలియో కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏరియా ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం వార్డులను సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం అందుబాటులో ఉండాలని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా వైద్యులను, అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్ గందె శ్రీనివాస్, బండ నరేష్, మాజీ కౌన్సిలర్ ముత్యం రాజ్, ఇమ్రాన్ లతో పాటు ఆసుపత్రి వైద్య బృందం, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story