- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ సీపీ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 'బాంబు'...
హుజూరాబాద్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం లక్ష్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం లక్ష్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియో ప్రస్తుతం హుజూరాబాద్ సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వీడియోను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
అవినీతికి అడ్డాగా సీపీ కార్యాలయం
కమిషనర్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందని, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన వద్ద ఉన్న వీడియో ఆధారాలను బయటపెడితే వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడుతుందని ఆయన హెచ్చరించడం సంచలనం రేపుతోంది. ఒక ఐఆర్ఎస్ అధికారి తండ్రి కోసం ప్రభుత్వ ఇన్నోవా వాహనాన్ని, కానిస్టేబుళ్లను కేటాయించారని, సీపీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత పనులకు కూడా ప్రభుత్వ వాహనాలను వాడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ఇసుక, రేషన్ బియ్యం, గుట్కా దందాల నుండి కొందరు పోలీస్ అధికారులే ఏజెంట్లుగా మారి కమిషనర్‌కు వాటాలు పంపుతున్నారని మండిపడ్డారు. హోంగార్డుల బదిలీల కోసం ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష చొప్పున సుమారు రూ. 1.86 కోట్లు వసూలు చేశారని బాంబు పేల్చారు. నగరంలోని ఎస్ఎన్ ప్రైడ్ మాల్‌కు ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. 25 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. కమిషనర్ తన కుటుంబంతో కలిసి దాబాలో భోజనం చేస్తే, ఆ బిల్లులను కూడా కింది స్థాయి అధికారులతో కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. "ఐపీఎస్ అధికారులపై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు ఆగాను. డీజీపీ గారు స్పందించి చర్యలు తీసుకోకపోతే, అసెంబ్లీ సమావేశాల లోపు నా దగ్గర ఉన్న వీడియో ఆధారాలను మీడియా ముందు పెట్టి సీపీ గుట్టు రట్టు చేస్తాను" అని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించడం సంచలనం కలిగిస్తుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో హీట్..
ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతుండగా క్షేత్రస్థాయిలో రాజకీయ సెగ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా హోంగార్డుల బదిలీలు, వసూళ్ల అంశాలపై ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించడంతో మున్ముందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ హుజూరాబాద్ ప్రజల్లో నెలకొంది.






