- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారదర్శక పాలనకు స్పెషల్ యాప్
పల్లెల్లో అభివృద్ధి నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం 'మేరీ పంచాయతీ' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

దిశ, హుజూరాబాద్ రూరల్: పల్లెల్లో నూతన పాలన ప్రారంభమైన నేపథ్యంలో, అభివృద్ధి నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 'మేరీ పంచాయతీ' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 15వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామానికి వచ్చే నిధులు ఏ పనులకు ఖర్చు చేస్తున్నారో ప్రతి ఓటరు తన స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంకెలే కాకుండా పనుల ఫోటోలను కూడా పర్యవేక్షించే వీలుండటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. నిధులు దుర్వినియోగమైతే నేరుగా యాప్ ద్వారానే ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించారు. సాంకేతికతతో కూడిన ఈ పద్ధతి ద్వారా అవినీతి రహిత పల్లెల నిర్మాణం సాధ్యమవుతుంది.
పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. ఇకపై గ్రామ అభివృద్ధి బాధ్యత కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల భుజస్కంధాలపై ఉంది. అయితే ప్రభుత్వాలు పంపే నిధులు సద్వినియోగం అవుతున్నాయా? లేదా? అనేది తెలుసుకోవడం ప్రతి ఓటరు ప్రాథమిక హక్కు. ఈ క్రమంలోనే పాలనలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ’ యాప్‌ను ప్రజల ముందుకు తెచ్చింది.
అక్రమాలకు చెక్..
సాధారణంగా గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ నిధులు, గ్రామపంచాయతీకి వచ్చే నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు వంటి వివిధ రూపాల్లో రూ.లక్షల నిధులు అందుతుంటాయి. ఈ నిధులు ఏ పనులకు ఖర్చు చేస్తున్నారు? డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, వీధి దీపాల వంటి పనుల కోసం కేటాయించిన సొమ్ము సరిగ్గా వినియోగిస్తున్నారా? లేదా అనే విషయంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు అలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి పైసా లెక్కను సామాన్యుడు సైతం తన స్మార్ట్ ఫోన్‌లో చూసుకునే వెసులుబాటు కలిగింది.
యాప్ వినియోగం ఇలా..
మీ గ్రామ అభివృద్ధిని పర్యవేక్షించడం ఇప్పుడు చాలా సులభం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మేరీ పంచాయతీ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయి, లాగిన్ అవ్వాలి. రాష్ట్రం, మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామ పంచాయతీ పేరును ఎంపిక చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీ గ్రామానికి వచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనుల జాబితా కనిపిస్తుంది.
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే...
కేవలం అంకెలు మాత్రమే కాకుండా, అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాప్‌లో ఒక పని పూర్తయినట్లు చూపిస్తూ గ్రామంలో ఆ పని జరగకపోతే లేదా నిధులు పక్కదారి పట్టినట్లు గమనిస్తే వెంటనే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.
బాధ్యతాయుత పౌరులుగా మేల్కొందాం..
గ్రామ పాలనలో పారదర్శకత అనేది కేవలం పాలకుల బాధ్యత మాత్రమే కాదు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. సాంకేతికతను అందిపుచ్చుకుని మేరీ పంచాయతీ యాప్ ద్వారా నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం ద్వారా అవినీతి రహిత పల్లెలను నిర్మించుకోవచ్చు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామస్తుడు ఈ యాప్‌పై అవగాహన పెంచుకోవాలని, గ్రామ వికాసంలో భాగస్వాములు కావాలని సామాజిక విశ్లేషకులు కోరుతున్నారు.






