ధ్యానమే సర్వరోగ నివారిణి

by velandi.Saikiran |

ధ్యానమే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని, కేవలం శ్వాసపై ఏకాగ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిరమిడ్ సొసైటీ

ధ్యానమే సర్వరోగ నివారిణి
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : ​ధ్యానమే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని, కేవలం శ్వాసపై ఏకాగ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిరమిడ్ సొసైటీ మాస్టర్ అనిల్ స్పష్టం చేశారు. పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని రాధాస్వామి సత్సంగంలో నిర్వహించిన ప్రత్యేక ధ్యాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ​ఈ సందర్భంగా మాస్టర్ అనిల్ మాట్లాడుతూ... మనిషికి వచ్చే అనేక శారీరక, మానసిక సమస్యలకు ధ్యానమే ఉత్తమ పరిష్కారం అని తెలిపారు.

కేవలం మందుల ద్వారా కాకుండా, సహజ సిద్ధమైన ధ్యాన పద్ధతి ద్వారా శరీరంలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి, వ్యాధులను నివారించుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా, శ్వాసపై ఏకాగ్రత పెట్టడమే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందన్నారు. ఈ ప్రక్రియలో మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి తగ్గి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.​ నిత్యం ధ్యాన సాధన చేయడం ద్వారా జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడుతుందని, మనశ్శాంతి లభించి, ఆయుషు కూడా పెరుగుతుందని సూచించారు.

ఆధునిక జీవనశైలిలో మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో, ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తద్వారా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన సాధకులు తాళ్లపల్లి రమేష్, యాదగిరి, మాస్టర్ గ్రాఫిక్స్ విజయ్ తో పాటు పలువురు ధ్యాన సాధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Next Story