ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు

by velandi.Saikiran |

ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు
X

దిశ,గంగాధర : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం గంగాధర ప్రజా కార్యాలయంలో మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులు అన్నాల్దాస్ లలిత, విలసాగర్ లక్ష్మీ, దూలం కవిత, జోగుల సతవ్వ, గడ్డం నవీన, పైడ్ల మల్లమ్మలకు ఆయన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికే రూ. కోట్లాది వ్యయంతో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రానున్న రోజుల్లో మరో 2,000 ఇండ్లను అదనంగా మంజూరు చేయించి ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయిస్తామని వెల్లడించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలనలో నిరుపేదల కోసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పేరుతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఘోరంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇంకా ఇండ్లు రాని నిరుపేదలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రామ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, స్థానిక సర్పంచ్ దూలం కళ్యాణ్, నాయకులు బిర్లా ఆనందం, సాగి అజయ్ రావు, దూల వీరేశం, అత్తాపురం తిరుపతి, రాచమల్ల భాస్కర్, కడారి కనుకయ్య, రెండ్ల రాజిరెడ్డి, గుండవేని తిరుపతి, ఆరే రాజశేఖర్, వేముల అంజి, బైరిశెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story