మంథని తహశీల్‌.. దళారుల అడ్డా!

by Ajay Maddhiboyina |

మంథని తహశీల్దార్ కార్యాలయం బ్రోకర్లు, ఫైరవీకారులకు అడ్డాగా మారింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఆసరాగా చేసుకుని దళారులు పట్టాల పేరిట దోపిడీకి తెగబడుతున్నారు.

మంథని తహశీల్‌.. దళారుల అడ్డా!
X

మంథని తహశీల్దార్ కార్యాలయం బ్రోకర్లు, ఫైరవీకారులకు అడ్డాగా మారింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఆసరాగా చేసుకుని దళారులు పట్టాల పేరిట దోపిడీకి తెగబడుతున్నారు. మీ సేవ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కైన బ్రోకర్లు దరఖాస్తుదారుల నుంచి అందినకాడికి గుంజుతున్నారు. ఆఫీస్ వేళల్లో కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు కనీస తాగునీరు, కూర్చోవడానికి వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- దిశ, మంథని

దిశ, మంథని : ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మంథని తహశీల్దార్ కార్యాలయం వేదికగా బ్రోకర్లు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాల నుంచి మొదలుకొని భూమి పట్టాల వరకు ఏ పని కావాలన్నా బ్రోకర్ల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయం తెరిచిన సమయం నుంచి సాయంత్రం మూసే వరకు ఈ దళారులు అక్కడే పడిగాపులు కాస్తూ పనులు చేయిస్తామంటూ అప్లికేషన్ దారులను మభ్యపెట్టి తృణమో పణమో గుంజుతున్నారు. తహశీల్దార్ కార్యాలయం ఫైరవీకారుల నిలయంగా మారిందని ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

వరంగా.. సాదాబైనామాలు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ప్రస్తుతం ఫీల్డ్ సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరుణాన్ని కొందరు బ్రోకర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తామే పట్టాలు ఇప్పిస్తామంటూ పట్టాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరికొందరు బ్రోకర్లు ఒకడుగు ముందుకు వేసి స్థానిక ‘మీ సేవ’ సెంటర్ల నిర్వాహకులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మీ సేవకు వచ్చే దరఖాస్తుదారుల వివరాలు తెలుసుకుంటూ అటు ఆన్‌లైన్ కేంద్రాన్ని, ఇటు తహశీల్ ఆఫీస్‌ను అడ్డాగా మార్చుకుని దోపిడీకి తెరలేపారు. కొన్ని మీ సేవ సెంటర్లలో దరఖాస్తుల నిమిత్తం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రుసుములు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

కిందిస్థాయి సిబ్బందిపై అసహనం...

తహశీల్దార్ కార్యాలయంలోని కిందిస్థాయి ఉద్యోగుల తీరుపై కార్యాలయానికి వచ్చే ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఉద్యోగులు ఆఫీస్ వేళల్లో సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. మీ సేవలో అప్లై చేసిన దరఖాస్తుల గురించి ఆఫీస్‌లో అడిగితే ‘మాకు రాలేదు’ అంటున్నారని, తీరా మీ సేవ సెంటర్‌కు వెళ్తే ‘మేము ఎప్పుడో పంపించాం’ అని సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఎక్కడో తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ తిరిగే ప్రజలకు కనీస తాగునీరు, కూర్చోవడానికి సదుపాయాలు కూడా కల్పించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫైరవీలు లేకుండా చర్యలు తీసుకోవాలి

మంథని తహశీల్దార్ కార్యాలయంలో ఫైరవీలు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలి. మీ సేవ ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించాలి. ఆఫీస్‌కు వచ్చే లబ్ధిదారులను ప్రలోభపెట్టి సర్టిఫికెట్లు, పట్టాలు ఇప్పిస్తామని నమ్మించే బ్రోకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే అధిక రుసుములు వసూలు చేసే మీ సేవ కేంద్రాలపై నిఘా పెట్టాలి. కార్యాలయంలో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలి.

- మంథని లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు, కేవీపీఎస్

మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం

కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి పనుల నిమిత్తం ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు లేదా బ్రోకర్లు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా మా దృష్టికి తీసుకురావాలి, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం సాదాబైనామా భూములకు సంబంధించి పంచనామా స్టేట్మెంట్లు తీసుకుంటూ పక్కాగా ఎంక్వైరీ చేస్తున్నాం. వాస్తవమని తేలితేనే పట్టా చేస్తాం. కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. మీ సేవ సెంటర్లలో అధిక వసూళ్లకు పాల్పడినా చర్యలు ఉంటాయి. ప్రజలు సమస్యల కోసం నేరుగా నన్ను కలిసి ఫిర్యాదు చేయవచ్చు.

- ఆరిఫ్ ఉద్దీన్, తహశీల్దార్, మంథని

Next Story