ఖాకీ ముసుగులో ఇద్దరు.. ఇద్దరే!?

by Jakkula.Mamatha |

కారేపల్లి మండలంలో ఇద్దరు హోంగార్డుల వ్యవహార శైలి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఖాకీ ముసుగులో ఇద్దరు.. ఇద్దరే!?
X

దిశ,కారేపల్లి: కారేపల్లి మండలంలో ఇద్దరు హోంగార్డుల వ్యవహార శైలి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 15 సంవత్సరాలుగా సింగరేణి మండలంలోనే విధులు నిర్వహిస్తున్న ఈ ఇద్దరు పోలీసులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలు జరిగినప్పటికీ కొద్ది కాలానికే తిరిగి సింగరేణి మండలానికే రావడం వెనుక బడా రాజకీయ బాబుల అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. స్థానికుల ఆరోపణల ప్రకారం.. ఒక పోలీస్ హోంగార్డు ఖాకీ యూనిఫామ్‌ను అడ్డుపెట్టుకుని చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడని, మరొకరు ఏకంగా వైన్ షాప్ లోనే కూర్చుని మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉంటూ తమ ప్రభావాన్ని కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల చిట్టీల వ్యవహారంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్ల కూడా స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, విధుల్లో ఉంటూనే మద్యం విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు మండల పరిధిలోని ఓ బెల్ట్‌షాపులో మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన అనంతరం, సంబంధిత హోంగార్డు తన హోదాను మరిచి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు హోంగార్డుల వ్యవహారాలపై ఇంటెలిజెన్స్, శాఖాపరమైన ఉన్నతాధికారులకు సమాచారం చేరినట్లు తెలుస్తోంది. ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్న దానిపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. దీర్ఘకాలంగా ఒకే మండలం లో కొనసాగుతున్న ఈ ఇద్దరి వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story