మంథనిలో పరిశ్రమల స్థాపనకు కృషి... మంత్రి శ్రీధర్ బాబు

by Bhanu |

ప్రపంచస్థాయిలో మంథని ప్రతిభకు చిహ్నంగా నిలిచేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

మంథనిలో పరిశ్రమల స్థాపనకు కృషి... మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, మంథని : ప్రపంచస్థాయిలో మంథని ప్రతిభకు చిహ్నంగా నిలిచేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణంలో బస్ డిపో సమీపంలో డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రోటో టైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ వర్క్స్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సాంకేతికత పరంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకుని వచ్చేందుకు మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రోటోటైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు.


మంథని పట్టణంలో టీ వర్క్స్ బృందం నుంచి 3 శిక్షకులను నియమిస్తామని, భావితరాలకు విజ్ఞాన నిలయం గా మంథని ప్రాంతం నిలవాలని కృషి చేస్తున్నామని అన్నారు. స్థానికంగా ఉన్న పిల్లలకు కింది స్థాయి నుంచి సంపూర్ణ పరిజ్ఞానం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మన జిల్లా పరిధిలో ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రోటో టైపింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ ను పరిశీలించేలా చూడాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. పాఠశాల విద్యార్థులకే కాకుండా ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా వీటిని వినియోగించుకోవాలని అన్నారు. రైతులకు ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి వారికి వచ్చే వివిధ ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చేందుకు సహాకారం అందిస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయిలో మంథని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి చేస్తున్నామని, హైదరాబాద్ కు దాదాపు 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతమైన మంథనిలో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ తీసుకొని వచ్చామని, భవిష్యత్తులో ఇక్కడ విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని చూపించి అనేక కంపెనీలను తీసుకొని వస్తామని మంత్రి తెలిపారు.


జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... రోజు వారి జీవనంలో మనకు ఉన్న అనేక సమస్యలను సాంకేతికతను వినియోగించి చిన్న చిన్న మార్పులు చేస్తే పరిష్కారం అవుతాయని మనకు ఆలోచన వస్తుందని, అటువంటి ఆలోచనలను వాస్తవ రూపంలో దాల్చేందుకు సహకారం అందించే దిశగా టీ వర్క్స్, డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్ వర్క్ బృందం ఆధ్వర్యంలో ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వచ్చే నూతన ఆలోచనలను ఇక్కడ ఉన్న ప్రోటో టైపింగ్ యంత్రాల మెషిన్స్ ద్వారా తయారీకి ప్రయత్నిస్తామన్నారు. రోజువారి సమస్యల పరిష్కారం ఆలోచనలు ముందుగా చిన్న స్థాయిలో తయారుచేసి సరిగ్గా పని చేసినట్లయితే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు కూడా సహకారం అందుతుందన్నారు. డ్రీమ్ స్టార్ట్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్ వర్క్ కు వయసుతో సంబంధం లేకుండా వినూత్న ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ వర్క్స్ సంచాలకులు జోగేందర్, ఆర్.డి.ఓ.సురేష్,అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story