బఫర్ జోన్ బెడద.. మానేర్ డ్యాంపై నోటీసుల గందరగోళం

by Naga Rani Yarlagadda |

కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ అధికారుల తీరు కలకలం సృష్టిస్తుంది.

బఫర్ జోన్ బెడద.. మానేర్ డ్యాంపై నోటీసుల గందరగోళం
X

దిశ, బ్యూరో కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ అధికారుల తీరు కలకలం సృష్టిస్తుంది.మానేర్ డ్యాం కట్ట చుట్టూ ఎస్ఆర్ఎస్పీ భూముల్లో పట్టా భూముల్లో పలు కట్టడాలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుంటే పట్టించుకోని అధికారులు నిర్మాణాలు చేపట్టి 30 ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ స్థానికులకు నోటీసులు ఇవ్వడం వారిని ఆందోళనకు గురిచేస్తుంది. ఊరు పేరు లేకుండా నోటీసులు ఇవ్వడం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పైగా 2021 డిసెంబర్ 21 న గత ప్రభుత్వ హయాంలో డ్యాం సేఫ్టీ అథారిటీ బఫర్ జోన్ పరిధిని పెంచుతూ జీవో ఇచ్చినప్పటికీ కనీసం ఆ జీవో ను వెలుగులోకి రానివ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల వేల ఇప్పుడు నోటీసులు జారీచేయడం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.

2021 డిసెంబర్​21 లో జీవో విడుదల

గత ప్రభుత్వం లో 2021 డిసెంబర్ 21 న డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు ప్రాజెక్టు కు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ కోసం అప్పటికే నిర్ధేశించినన బఫర్ జోన్ పరిధి 100 మీటర్లను అదనంగా మరో 100 మీటర్లకు పెంచుతూ 200 మీటర్లుగా నిర్ణయించారు .దీనికోసం ప్రత్యేక జీవోను జారీచేశారు. కానీ ఆ జీవో ను వెలుగులోకి రానివ్వలేదు. అధికారులు ఎక్కడ అమలు కూడ చేయలేదు. అప్పుడు స్థానికంగా వెలుస్తున్న కట్టడాలకు కానీ అప్పటికే నిర్మించుకుని నివాసం ఏర్పరుచుకున్న వారికి కానీ ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు . సహజంగా డ్యాం కట్ట పక్కన కట్టడాలు చేపడితే ఎస్ఆర్ఎస్పీ అధికారులతో నో అబ్జెక్షన్ లేఖ తీసుకోవాలి అనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. దీంతో అప్పట్లో ఎస్ఆర్ఎస్పీ అధికారులపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయినప్పటికీ నిర్మాణాలు ఎక్కడా ఆగలేదు. దీంతో మున్సిపల్ అధికారులు ఒక్క అడుగు ముందుకు వేసి బహుళ అంతస్తులకు అపార్ట్ మెంట్లకు పర్మిషన్లు ఇచ్చారు. డ్యాం కట్ట పక్కన భవనాలు నిర్మాణం జరగడం తో ఆహ్లాదకరమైన వాతావరణం కావడం చేత జనం ఎగబడి అ ప్రాంతంలో ప్లాట్లు కోనుగోలు చేసి నిర్మాణాలు చేసుకున్నారు. నిన్నా మొన్నటివరకు సైతం జనం లక్షల్లో డబ్బులు పెట్టి ఆ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. ఒక్కసారిగా ఎస్ ఆర్ ఎస్పీ అధికారులు నోటీస్ జారీచేయడం తో ఇప్పుడు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్న జనం ఆందోళన చెందుతున్నారు. మా పరిస్థితి ఏంటీ అంటూ ఆవేదనతో ఆదుకోండని రాజకీయ నేతలను వేడుకుంటున్నారు.

నోటీసుల వెనుక ఆంతర్యమేంటీ..?

2021 డిసెంబర్21​లో విడుదలైన జీవో ను అప్పుడు వెలుగులోకి రానివ్వకపోవడానికి కారణం ఏంటి? సరిగ్గా నాలుగేండ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధికారులు నోటీసులను తెరమీదికి తేవడం వెనుక ఆంతర్యం ఏమిటీ అనేది స్థానికంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలుగేళ్లలో ఏనాడు కట్టను ఆనుకుని నిర్మాణాలు చేపట్టిన వారికి సమాచారం ఇవ్వకుండా కనీసం నూతనంగా నిర్మాణాలు చేపడుతున్న బహుళ అంతస్తులను అడ్డుకోకుండా ఉన్న ఫలంగా నోటిసులు జారీచేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. అయితే నోటీసుల్లో ఎవరి పేరు లేకపోవడం కేవలం ఎస్ఆర్ఎస్పీ అధికారుల చిరునామాతో ప్రచారం కోసం పంచిన పాంప్లమెంట్ లాగా జారీచేయడం స్థానికుల్లో పలు సందేహాలకు కారణమవుతోంది. దీని వెనుక ఏదైనా రాజకీయకుట్ర దాగి ఉందా.. లేక సహజంగానే ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది .

నేతల హడావిడి

ఎస్ఆర్ఎస్పీ అధికారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ డ్యాం కట్ట పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకున్న సుమారు 50 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 100 మంది కి జారిచేసేందుకు నోటీసులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే అధికారులు జారీ చేసిన నోటీసుల్లో ఏ ఒక్కరి పేరు, చిరునామా లేకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఏది పరిగణలోకి తీసుకోని రాజకీయ నాయకులు సంబంధిత ప్రాంతానికి వెళ్లి హడావిడి చేయడం ఒక్కరిని చూసీ మరొక్కరు పోటీ పడుతూ పరామర్శలు చేయడం స్థానికంగా దుమారం లేపుతున్నాయి .ఒకరిని మించి ఒకరు వారికి హామీలు ఇవ్వడం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే గత ప్రభుత్వంలో ఉండి ఆ జీవో జారీ అయినప్పుడు అప్పటి ప్రభుత్వానికి కనీసం సూచనప్రాయంగా కూడా అభ్యంతరం తెలపని నేతలు ఇప్పుడు హడావిడి చేస్తూ ఒకరు ఎలా కూలుస్తారు.. అండగా ఉంటాం అంటూ హామీ ఇస్తుంటే మరోక నాయకుడు అక్కడి నుంచి అధికారులకు ఫోన్ చేసి నేను అండగా ఉంటాను. బుల్డోజర్ నన్ను దాటి ఎలా వెళుతుందో చూస్తానంటూ హెచ్చరించడం పార్టీ మారి మరో పార్టీలో చేరిన ప్రముఖ నాయకుడు కేంద్ర మంత్రితో కలెక్టర్​కు ప్రభుత్వానికి మాట్లాడిస్తా అంటూ ప్రగల్భాలు పలకడంతో స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదంటూ బాధితులు వాపోతున్నారు

కారకులు ఎవరు?బాధ్యత విస్మరించింది ఎవరు?

డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు డ్యాం సేప్టి దృష్ట్యా బఫర్ జోన్ పరిధిని పెంచడం సమర్థించదగ్గ విషయమే అయినప్పటికీ జీవో ను జారీచేసిన ప్రభుత్వం డ్యాం సేఫ్టీ అథారిటీ అప్పుడే విషయాన్ని వెలుగులోకి తీసుకురాకపోవడం వెనుక కారణమేంటి ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా ? లేక అప్పటి ప్రభుత్వమే అధికారులకు ప్రత్యేక సూచనలు ఏమైనా చేసిందా? ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏమిటి ? ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ లో హైడ్రా తరహా చర్యలకు ఏమైనా పథకరచన చేసిందా.. అనే సందేహాలు వ్యక్తం అవుతూ స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. కాగా ఎస్ఆర్ఎస్పీ అధికారులు సైతం అడ్డగోలు నిర్మాణాలు జరుగుతుంటే అప్పుడు నోరుమెదపకపోవడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది. పేదలను పక్కన పెడితే బహుళ అంతస్తులకు పర్మిషన్ లు ఎలా వచ్చాయి. ? ఇందులో గత పాలకుల ప్రమేయం ఏమైనా ఉందా? ప్రస్తుత పరిస్థితికి కారకులు ఎవరు? తమ బాధ్యతలను విస్మరించి వ్యవహరించింది ఎవరు ? లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోళ్లు చేసుకుని స్థిరనివాసాలు ఏర్పరచుకుంటే ఇప్పుడు ఎటుకాని పరిస్థితి అయ్యింది అంటూ స్థానికులు అక్కడికి వెల్లిన మీడియా ప్రతినిధులతో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

ఊరు పేరు లేకుండా నోటీసులు జారీ

డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనలతో రంగంలోకి దిగిన ఎస్ఆర్ఎస్పీ అధికారులు అక్రమ నిర్మాణాల పేరిట జారీచేసిన నోటీసులు ఊరు పేరు లేకుండా జారీచేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే డ్యాం భద్రత యాక్టు అమలులోకి వచ్చింది అంటున్న అధికారులు ప్రత్యమ్నాయం చూసుకోవాలంటూ నోటీసులు జారీచేయడం డ్రైనేజీ వ్యవస్థ రిలీఫ్​వెల్స్ పరిస్థితి మరియు పనితీరుతో పాటుగా ఔట్పాల్ సమర్థతను పరిశీలన నిమిత్తం కట్టనుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను కట్టడాలను జరుపరాదు అంటూ హెచ్చరించిన అధికారులు చట్టపరంగా శిక్షలు ఉంటాయని సూచించినప్పటికీ అవి ఆకాశరామన్న ఉత్తరంలా ప్రత్యేకంగా ఎవరిపేరు పెట్టకపోవడం తో ఇది తప్పు తమ మీదికి రాకుండా చూసుకునేందుకా లేకా భవిష్యత్ లో కఠిన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా అనేది వేచి చూడాలి. అయితే ప్రత్యేకంగా పేరు లేకుండా ఇళ్లు ఇళ్లు తిరుగుతూ నోటీసులు జారీచేయడం వెనక ఎవరు కోర్టుకు వెల్లకుండా ఉండేందుకేనా అనేది స్థానికంగా చర్చ జరుగుతుంది.

Next Story