- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యాచార కేసులో వ్యక్తికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ పై అఘాయిత్యానికి పాల్పడిన ఓ వృద్ధుడికి పెద్దపల్లి కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించింది.

దిశ, పెద్దపల్లి : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ పై అఘాయిత్యానికి పాల్పడిన ఓ వృద్ధుడికి పెద్దపల్లి కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించింది. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లు (62) వృత్తిరీత్యా కూలీ. 2024 ఏప్రిల్ 23న అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లగా, ఆమె కుమార్తె ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఉదయం 9 గంటల సమయంలో బాధితురాలు ఇంటి ముందు రేకుల కింద కూర్చొని ఉండగా, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన రాయమల్లు అక్రమంగా లోపలికి ప్రవేశించాడు. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. పని ముగించుకుని వచ్చిన తల్లికి.. బాధితురాలు జరిగిన దారుణాన్ని విలపిస్తూ చెప్పింది. దీంతో బాధిత కుటుంబం వెంటనే పోత్కపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న అప్పటి పోత్కపల్లి ఎస్‌ఐ అశోక్ రెడ్డి కేసు నమోదు చేయగా అప్పటి సీఐ సుబ్బారెడ్డి విచారణ చేపట్టి నిందితుడు రాయమల్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో జరిగింది. న్యాయమూర్తి సునీత ఇరుపక్షాల వాదనలు విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి, నిందితుడి నేరాన్ని నిర్ధారించేలా బలమైన వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు రాయమల్లుకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.7,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.






