- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 ఏళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష..
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన 8 ఏళ్ల చిన్నారి అబ్దుల్ వహీద్ ఖాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

దిశ, కూకట్‌పల్లి: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన 8 ఏళ్ల చిన్నారి అబ్దుల్ వహీద్ ఖాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మేడ్చల్–మల్కాజ్గిరి 3వ అదనపు కోర్టు న్యాయమూర్తి మండవ వెంకటేశ్వరరావు ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించారు. పోలీసులు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీ రామకృష్ణరావు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ పరిధిలోని అల్లావుద్దీన్‌కోటిలో నివాసముంటున్న అబ్దుల్ వసీం ఖాన్ కుమారుడు అబ్దుల్ వహీద్ ఖాన్ (8)ను 2023 ఏప్రిల్ 20న ట్రాన్స్‌జెండర్ ఇమ్రాన్ అలీ ఖాన్ అలియాస్ ఫిజా (33) చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. చిట్టీ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. వసీం ఖాన్ బావ ఆసిమ్, ఇమ్రాన్ వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, అందులో రూ.4 లక్షలు ఇవ్వకుండా ఇమ్రాన్ ఆలస్యం చేయడంతో వసీం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతీకార భావంతో చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, ఆటో డ్రైవర్ మొహమ్మద్ రఫీక్ (32) సహాయంతో ఫతేనగర్ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్ నాలాలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో విచారణ పూర్తయ్యాక ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్‌కు ఉరిశిక్ష, అతనికి సహకరించిన ఆటో డ్రైవర్ రఫీక్‌కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
“మూడేళ్లకు న్యాయం జరిగింది”
తన కుమారుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో సంతోషంగా ఉందని చిన్నారి తండ్రి వసీం ఖాన్ తెలిపారు. న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు, కేసును ఛేదించిన పోలీసు యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






