మొక్కజొన్న కొనుగోళ్ళు వేగవంతం చేయాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

by Ratna Kumari |

మొక్కజొన్న కొనుగోళ్ళు వేగవంతం చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోళ్ళు వేగవంతం చేయాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
X

దిశ, జమ్మికుంట : అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తాము పండించిన మొక్కజొన్న పంటను విక్రయించేందుకు వారం రోజులుగా జమ్మికుంట కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నారని వెంటనే కొనుగోళ్ళు వేగవంతం చేయాలని, లారీల కొరత సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జమ్మికుంట కొత్త మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసు దేవరెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 29 న అట్టహాసంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 10% కూడా కొనుగోలు చేయలేదనీ, కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారని, వెంటనే కొనుగోళ్ళు యుద్ధ ప్రాతిపదికన జరపాలని, తూకం వేసిన బస్తాలు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


సుమారు 30 వేల క్వింటాళ్ల మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి సిద్ధంగా అన్నదాతలు ఎదురు చూస్తున్నప్పటికీ మార్క్ పెడ్ అధికారుల నిర్లక్ష్యం వహించడం మూలంగా అన్నదాతలు. అరిగోశ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వ చేయడానికి గోడౌన్ సమస్య తీవ్రంగా ఉందని, రవాణా కోసం లారీల సమస్య ఉందని నిర్వాహకులు చెబుతున్నారని, సమస్యలు పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఒకవైపు వాతావరణ శాఖ అకాల వర్షాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు. మార్కెట్ లో కనీస సౌకర్యాలు పాలకవర్గం కల్పిస్తున్నప్పటికీ మార్క్ ఫెడ్ సిబ్బంది తగినంతగా లేకపోవడం మూలంగా కొనుగోలు ఆలస్యం అవుతున్నాయన్నారు. వెంటనే తగినంత సిబ్బందిని నియమించి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. థంబ్ ఇంప్రెషన్ రాకపోవడం మూలంగా అనేక మంది రైతులు తాము పండించిన పంటను మద్దతు దరకు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.


మండలానికి ఒక మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు సెంటర్లలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ప్రాధాన్యత క్రమంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు, బహిరంగ మార్కెట్లో ధరకు సుమారు క్వింటాల్కు 700 వ్యత్యాసం ఉండడంతో మధ్య దళారులు రైతులను మభ్యపెట్టి దోచుకుంటున్నారన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా, రైతులకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దండి గారి సతీష్, వడ్లూరి కిషోర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం అశోక్, మండల అధ్యక్షుడు కాయిత లింగారెడ్డి, కోశాధికారి లింగంపల్లి శ్రీనివాస్, రైతులు గుండారపు కుమారస్వామి, ఉష్కే మల్ల సంజీవ్, సమ్మయ్య, భూమి రెడ్డి, రజిత, రాజిరెడ్డి, రాజేశ్వరరావు, మల్లయ్య పాల్గొన్నారు.

Next Story