ఇత్తు మొలవదు.. కూలీ దొరకడు.. ఆగం చేస్తున్న ఇథనాల్

by Ajay Maddhiboyina |

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల, పోతారం శివార్లలో ఉన్న రెండు ఇథనాల్ ఫ్యాక్టరీలపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుర్వా సన, కాలుష్యంతో చుట్టుపక్కల సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇత్తు మొలవదు.. కూలీ దొరకడు.. ఆగం చేస్తున్న ఇథనాల్
X

దిశ, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల, పోతారం శివార్లలో ఉన్న రెండు ఇథనాల్ ఫ్యాక్టరీలపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుర్వా సన, కాలుష్యంతో చుట్టుపక్కల సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పంటలు పండకపోవడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా తగ్గిన దిగుబడి..

ఇథనాల్ ఫ్యాక్టరీల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములపై కాలుష్య ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారు. గతంలో పంటలు పండిన భూముల్లో ప్రస్తుతం దిగుబడులు తగ్గిపోయాయని వాపోతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో వ్యవసాయ కూలీలు సైతం రావడం లేదని పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి దుమ్ము, దుర్వాసనతో చుట్టుపక్కల గొర్రెలు, బర్రెలు, ఎద్దులు కూడా అటువైపు వెళ్లడం లేదంటున్నారు.

భూగర్భ జలాలపై ఆందోళన..

ఫ్యాక్టరీల వ్యర్థాలు, కాలుష్యంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇటీవల దాచారం గ్రామ చెరువులోకి నీళ్లు చేరడంతో చేపలు మృత్యువాత పడ్డాయని.. కలుషిత నీళ్లు తాగి 5 గొర్రెలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

29న బెజ్జంకి మండల బంద్..

ఇథనాల్ ఫ్యాక్టరీల రద్దుకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 29న బెజ్జంకి మండల బంద్ నిర్వహించనున్నట్లు అఖిలపక్ష నాయకులు ప్రకటించారు. ప్రజలు, వ్యాపారులు బం ద్‌కు సహకరించాలని వారు కోరారు.

కూలీలు దొరకడం లేదు

నేను రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ప్రస్తుతం కలుపు దశలో ఉంది. కూలీలు మాత్రం రానంటున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఫ్యాక్టరీ సమీపంలో నీళ్లు తాగి 5 గొర్రెలు చనిపోయాయి. కలెక్టర్ గారు స్పందించి ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుకుంటున్నా.

-చిట్టి వంశీధర్, గుగ్గిళ్ల గ్రామం

పంట దిగుబడి బాగా తగ్గింది

మా రెండెకరాల పొలం ఇథనాల్ ఫ్యాక్టరీ పక్కనే ఉంది. ఫ్యాక్టరీ రాకముందు దిగుబడి బాగా వచ్చేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో పంటలు పండడం లేదు. వాసన, సౌండ్, దుమ్ముతో కూలీలు కూడా రావడం లేదు. మాకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అధికారులు స్పందించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి.

-కవ్వ సంధ్య, తిమ్మాయిపల్లి గ్రామం

Next Story