స్థానిక ఎన్నికల హీట్..

by Elthuri vijay kumar |

హుజురాబాద్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో రాజకీయాలు వేడెక్కాయి.

స్థానిక ఎన్నికల హీట్..
X

స్థానిక ఎన్నికల హీట్..

-రిజర్వేషన్లపై నేతల ఆరా..

-హుజురాబాద్ మండలంలో బీసీ 8, ఎస్సీ 3, ఎస్టీ 2 రిజర్వేషన్ల ఖరారు..?

దిశ,హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో రాజకీయాలు వేడెక్కాయి. 2024 కులగణన ప్రకారం బీసీలకు 42 శాతం, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ ప్రక్రియను అధికారులు అత్యంత గోప్యంగా పూర్తి చేయడంతో, ఆశావహులు, పార్టీ నాయకులలో ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ మండలంలో 20 గ్రామపంచాయతీలు, 12 ఎంపీటీసీలు ఉన్నాయి. ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ పరిశీలకులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. 20 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచుల రిజర్వేషన్లపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..మండలంలోని రాజపల్లి ఓసీ, చేల్పూర్ ఎస్సీ, శాలపల్లి-ఇంద్రనగర్ బీసీ, రాంపూర్ ఓసీ, రంగాపూర్ ఓసీ, వెంకట్రావుపల్లి ఎస్టీ, సిరిసపల్లి ఓసీ, పోతిరెడ్డిపేట ఓసీ, సింగాపూర్ బీసీ, తుమ్మనపల్లి బీసీ, మాందాడిపల్లి బీసీ, చిన్న పాపయ్యపల్లి బీసీ, పెద్ద పాపయ్యపల్లి ఎస్టీ, కందుగుల బీసీ, అంబేద్కర్ నగర్ ఎస్సీ, జూపాక ఓసీ, ధర్మరాజుపల్లి బీసీ, కనుకుల గిద్ద ఎస్సీ, బోత్తలపల్లి బీసీ, కాట్రపల్లి ఓసీ లేదా బీసీగా రిజర్వేషన్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీసీ లేదా ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

రాజకీయ సమీకరణాలు...

పాత రిజర్వేషన్లతో బేరీజు వేసుకుంటూ, తమ అనుచరులతో భవిష్యత్తు రాజకీయాలపై నాయకులు చర్చిస్తున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో, తమకు ఏ స్థానం వస్తుందోనని ఆశావహులు ఆరా తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులను గెలిపించుకునేందుకు నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసిన తర్వాత, మహిళలకు 50 శాతం స్థానాలు డ్రా పద్ధతిలో కేటాయించనున్నారు.

శిక్షణ కార్యక్రమం...

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల నియమావళిపై ఆర్ఓ, ఏఆర్ఓలకు జిల్లా కలెక్టరేట్‌లో నేడు శిక్షణ జరగనుంది. గ్రామ యూనిట్‌గా వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలకు, జిల్లా యూనిట్‌గా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు, రాష్ట్ర యూనిట్‌గా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల స్థానాలకు రిజర్వేషన్లు చేశారు. ఈ ప్రక్రియ అంతా గోప్యంగా జరగడంతో, గ్రామాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Next Story