- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు మరింత ప్రియం.. జూన్ నుంచి పెరిగిన వాల్యూ ప్రకారమే శ్రీకారం
రాష్ట్ర ఖజానా నింపుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి భూముల మార్కెట్ విలువల పెంపునకు శ్రీకారం చుట్టింది. ఓపెన్ మార్కెట్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు వాటికి చాలా తక్కువగా ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు భూముల విలువలను సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దిశ, జగిత్యాల ప్రతినిధి:రాష్ట్ర ఖజానా నింపుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి భూముల మార్కెట్ విలువల పెంపునకు శ్రీకారం చుట్టింది. ఓపెన్ మార్కెట్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు వాటికి చాలా తక్కువగా ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు భూముల విలువలను సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ప్రస్తుత ధరలు, డిమాండ్ ఉన్న ప్రాంతాలు, మార్కెట్ పరిస్థితులపై రెవెన్యూ–రిజిస్ట్రేషన్ శాఖలు సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాయి. కొత్త మార్కెట్ విలువల ప్రకారం ఈనెల 28 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రక్రియను జూన్ 3 వరకు పొడిగించినట్లు సమాచారం.
ప్రభుత్వానికి ఆదాయం.. సామాన్యులపై భారం..
భూముల మార్కెట్ విలువల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం పెరగనున్నప్పటికీ, సామాన్యులు మాత్రం అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, చిన్నచిన్న వ్యవసాయ భూములు కొనుగోలు చేసే మధ్యతరగతి, పేద కుటుంబాలపై రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ ఫీజుల రూపంలో భారీ భారం పడనుంది. మార్కెట్ విలువ పెరిగిన ప్రాంతాల్లో లక్షల రూపాయల అదనపు ఖర్చు వచ్చే అవకాశముండటంతో కొత్తగా భూములు కొనుగోలు చేయాలనుకునే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు అధికంగా ఉండగా తాజా నిర్ణయంతో భూముల కొనుగోలు మరింత భారంగా మారనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా డిమాండ్ ఉన్న ఏరియాల్లో నే భూముల విలువ ఓపెన్ మార్కెట్ అనుసరించి పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, కొండగట్టు పరిసర ప్రాంతాలలో అగ్రికల్చర్ తో పాటు కమర్షియల్ భూములకు భారీ డిమాండ్ ఉండగా అక్కడ ఉన్న భూముల విలువ మరింత పెరగనుంది.
ఆ రోజు నుంచే పెరగనున్న చార్జీలు
మే 28 నుంచే పెంచిన మార్కెట్ విలువలకు అనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తొలుత ప్రకటించినప్పటికీ అందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు పూర్తికాలేదని తెలుస్తోంది. భూముల తాజా మార్కెట్ విలువలు ఆన్‌లైన్ వ్యవస్థలో అప్‌డేట్ చేయడం, రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేపట్టడం, జిల్లా వారీగా సవరించిన విలువల అమలు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో అమలును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెంచిన మార్కెట్ విలువలను జూన్ మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో హడావిడి వాతావరణం నెలకొంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ
పెరిగే మార్కెట్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ భారం నుంచి తప్పించుకునేందుకు సామాన్యులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ముందస్తుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని కొనుగోలుదారులకు సూచిస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ కనిపిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా జూన్ 3 వరకు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదివరకు రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉండగా పెరిగిన టైమింగ్స్ కు అనుగుణంగా మరో 20 స్లాట్లు పెంచుతూ మొత్తంగా 68 రిజిస్ట్రేషన్ల వరకు పూర్తయ్యే ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది. అయితే ఒకేసారి భూముల మార్కెట్ విలువలు, స్టాంప్ డ్యూటీ పెరగడం వల్ల రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






