- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూముల ధరలు హైక్
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పెరిగిన భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం మరింత మందగించే అవకాశం ఉందనే విమర్శలు.

దిశ, కొత్తపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూముల మార్కెట్ విలువను సవరణ చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు అపార్టుమెంట్ల కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించి.. ప్రస్తుత మార్కెటు విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందిన ప్రదేశాలతో పాటు నూతనంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటూ తాజాగా ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో మదింపు చేపట్టింది. ప్రభుత్వం ఆమోదించిన కొత్త విలువలను అధికారికంగా శాఖ పోర్టల్లో అప్డేట్ చేయనుంది.
నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భూముల విలువలను పెంచగా కొన్నిచోట్ల పాత ధరలనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. పలు చోట్ల భూముల విలువ 50 నుంచి 100 శాతం వరకు పెంచినట్లు తెలిసింది. ఇప్పటికే అధిక విలువలున్న చోట పెంచలేదు. ప్రభుత్వ విలువ తక్కువగా.. బహిరంగ మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నచోట్ల నూరు శాతం వరకు పెంచినట్లు సమాచారం. భూముల విలువ సవరణ ద్వారా జిల్లా కి గరిష్ఠంగా రూ.30 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
వారం ముందు నుంచే కార్యాలయాలు కలకల...
భూముల విలువలను భారీగా పెంచుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్పడంతో ప్రజలలో ఆందోళన పెరిగింది. ఈనెల చివరి నుంచే పెంచిన విలువలు అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించారు. ఈ ప్రకటనతో సబిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాలలో వారం రోజులుగా సందడి పెరిగిపోయింది. భూములను, స్థలాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారంతా త్వరగా వాటి రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్నారు. దాదాపు గా పెద్ద సంఖ్యలో అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..ఇటు తహసీల్దార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఎకరం ధర కనిష్ఠంగా రూ.75 వేలు ఉండగా దీన్ని ప్రభుత్వం రూ.2.75 లక్షలకు పెంచింది. అంటే పల్లెటూళ్లలో ఎకరం ధర ఏకంగా 266.66 శాతం పెరిగింది. కరీంనగర్ లో ఎకరం ధరను రూ.3 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిసింది. మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూముల ధరలను ఎకరానికి కనిష్ఠంగా రూ. 5 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిసింది. రోడ్ల పక్కన, హైవేల పక్కన వ్యవసాయ భూముల ధరలను పెంచారు.
రియల్ పై ప్రభావం.. ప్రజల పై భారం..
అడ్డగోలు విధానాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు భూముల ధర పెంపుతో మరో పిడుగు వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారంపై భూముల ధర పెంపు భారీ ప్రభావాన్ని చూపుతుందని రియల్ ఎస్టేట్‌వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భూములు, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొచ్చే పరిస్థితి లేదని అంటున్నాయి.
15 శాతం నుంచి 100 శాతానికి
బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు మధ్యగల వ్యత్యాసాన్ని అంచనా వేసిన సర్కార్.. భూములు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి కనిష్ఠంగా 15 శాతం, గరిష్ఠంగా 100 శాతం పెంచింది. బహిరంగ మార్కెట్ ధర, ప్రభుత్వ ధర మధ్య వ్యత్యాసం 20 శాతం లోపు ఉంటే అక్కడ ధరలను పెంచలేదు. వ్యత్యాసం 20-50 శాతం మధ్య ఉంటే అక్కడ 15 శాతం పెంచింది. ఇక 50-100 శాతం వ్యత్యాసం ఉంటే అక్కడ 25 శాతం, 100-200 శాతం వ్యత్యాసం ఉంటే 50 శాతం, 200-500 శాతం వ్యత్యాసం ఉంటే 75 శాతం, 500 శాతం వరకు వ్యత్యాసం ఉన్నచోట 100 శాతం ధరలను పెంచింది.
జగిత్యాల జిల్లాలో
దిశ, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి,రాయికల్, మల్యాల ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరగడంతో రిజిస్ట్రేషన్ వ్యయం ఒక్కసారిగా పెరిగింది. పెరిగిన మార్కెట్ విలువలతో ఇదివరకే నత్త నడకన సాగుతున్న రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి మరి కొంతకాలం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వానికి అదనపు ఆదాయం
భూముల మార్కెట్ విలువల ఆధారంగానే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ వసూలు చేస్తారు. మార్కెట్ విలువలు పెరిగిన నేపథ్యంలో ప్రతి రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరగనుంది. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ పై గతంలో వసూలు చేసిన 7.5శాతం ఫీజు పెంచనప్పటికీ భారీగా భూముల మార్కెట్ వాల్యూ పెంచడంతో కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి.
గజం రూ.5000.. మార్కెట్ వాల్యూ రూ.6,200
మార్కెట్ విలువల పెంపు ప్రభావం నేరుగా భూములు కొనుగోలు చేసే వారిపైనే పడుతోంది. జిల్లాలోని కోరుట్ల పట్టణ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల(కొన్ని శివారు ప్రాంతాల్లో మాత్రమే) గజం భూమి రూ.5,000 కు చొప్పున కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం కనిష్ట మార్కెట్ విలువను రూ.6,200గా నిర్ణయించింది. దీంతో అసలు భూమి కొనుగోలు ధర కంటే ఎక్కువ విలువపై రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోరుట్లలోనే అత్యధిక పెరుగుదల
జగిత్యాల జిల్లాలో అత్యధికంగా మార్కెట్ విలువలు పెరిగింది కోరుట్ల పట్టణంలోనే. ఇక్కడ కనిష్ట ధర గజానికి రూ.4,100 నుంచి రూ.6,200కు పెరగగా, గరిష్ట ధర రూ.26,700 నుంచి రూ.40,100కు చేరింది. జిల్లా కేంద్రం జగిత్యాలలో కనిష్ట ధర రూ.4,800కు, గరిష్ట ధర రూ.30,800కు పెరిగింది. మెట్పల్లి, ధర్మపురి, ధరూర్, మోతె ప్రాంతాల్లో కూడా మార్కెట్ విలువలు గణనీయంగా పెరగడం గమనార్హం. మరోవైపు పట్టణాలతో పాటు మున్సిపల్ విలీన గ్రామాల్లోనూ భూముల విలువలు భారీగా పెరిగాయి. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకీన్‌పూర్‌లో కనిష్ట విలువ రూ.600 నుంచి రూ.1,200కు పెరగగా, మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని అరపేటలో రూ.1,100 నుంచి రూ.3,200కు పెరిగింది. వెంకట్రావుపేటలో కూడా కనిష్ట ధర రూ.1,100 నుంచి రూ.2,000కు చేరింది.
రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో భూముల మార్కెట్ విలువలు పెంచడం వల్ల కొనుగోలుదారులు మరింత వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో భూముల కొనుగోలు, అమ్మకాలు తగ్గి రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పున పరిశీలించి రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలి.-జంగపల్లి రాజారెడ్డి కోరుట్ల రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు






