జమ్మికుంటలో రెచ్చిపోతున్న భూ బకాసురులు.. సర్కార్ భూమిపై అక్రమార్కుల కన్ను

by Malleboina Mahesh |

జమ్మికుంటలో ప్రభుత్వ భూముల కబ్జా! 4 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన అక్రమార్కులు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.

జమ్మికుంటలో రెచ్చిపోతున్న భూ బకాసురులు.. సర్కార్ భూమిపై అక్రమార్కుల కన్ను
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుండడంతో నివేశన స్థలాలకు డిమాండ్ పెరిగి భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. దీంతో అక్రమార్కుల కన్ను నిరూపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల పై పడింది. దీంతో ప్రభుత్వ భూములు అక్రమణకు గురవుతున్నాయి. అడిగేవారు లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్నారు. కళ్లముందే ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.

ప్రభుత్వ స్థలాలు టార్గెట్ గా కబ్జాలు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి గ్రామ శివారులో 431 సర్వేనెంబర్ లో ప్రభుత్వ భూమిని భూకబ్జాదారులు ఆక్రమించి భూకబ్జాలకు పాల్పడుతున్నారు. జమ్మికుంట నుంచి ఇల్లందకుంట పోయే రహదారిలో ఉండడం వల్ల ఈ భూమికి విలువ రావడంతో భూకబ్జాదారులు ఈ భూమిపై కన్నేసి కబ్జా చేసి అమ్మకాలు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు

సర్వేనెంబర్ 431 లో గల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించి క్రయవిక్రయాలు చేస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములకు దొంగ కాగితాలు సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారని కొత్తపెల్లి ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు నాయకుల అండదండలతోనే భూకబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షల్లో చేతులు మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో కంచె చేను మేస్తుందా అన్న చందంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు కళ్ల ముందే కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తుంది. కొందరు ప్రజాప్రతినిధులే ఈ భూ అక్రమణలకు పాల్పడటంతో అధికారులు జీ హుజూర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూములను కాపాడాలి

కొత్తపెల్లి శివారులోని 431 సర్వేనెంబర్ లో 6 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి కలదు. ఈ భూమిలో కొత్తపల్లి శ్మశాన వాటికకు, మసీదుకు, బీడీ కార్మికుల ఇండ్లకు పోను నాలుగు ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కొత్త పెల్లి ప్రజలు కోరుకుంటున్నారు. భూకబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ లు వ్యక్తమవుతున్నాయి.

అక్రమార్కులకు అధికారులు సపోర్టు

అక్రమార్కులు రాజకీయ పలుకుబడి కలిగిన వారు కావడం చేత యథేచ్ఛగా ప్రభుత్వ భూములు అక్రమణకు గురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులు అధికారులతో కలసి భూ కబ్జాలకు పాల్పడటం తో స్థానికంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి సర్వే చేసి హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని లేదంటే ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు ఆందోళనకు దిగుతామన్నారు. తక్షణమే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పాతాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story