- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలిని మోసం చేసిన లేడీ కిలాడీ అరెస్ట్..
వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న ఓ లేడీ కిలాడీని కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, కోరుట్ల రూరల్: వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న ఓ లేడీ కిలాడీని కోరుట్ల పోలీసులు కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.2.03 లక్షల నగదును, ఆమె విక్రయించిన 25 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 6న వల్లంపల్లి గ్రామానికి చెందిన కోటే గంగు (70) అనే వృద్ధురాలు కోరుట్ల బస్టాండ్‌లో రాయికల్ వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా, దండ్ల లావణ్య (45), మోకానిపల్లె, నవీపేటకు చెందిన మహిళ ఆమెతో పరిచయం పెంచుకుంది. మోకాళ్ల నొప్పులకు మంచి వైద్యం అందించే డాక్టర్ తనకు తెలుసని నమ్మించి ఆటోలో నంది కామన్ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ఒక భవనాన్ని చూపించి డాక్టర్ అందులో ఉంటాడని, ఎక్స్‌రే తీయించుకోవాలంటే మెడలో బంగారు ఆభరణాలు ఉండకూడదని చెప్పి వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును తీసుకుంది.
గతంలో కూడా ఇదే తరహా నేరాలకు
అనంతరం కూరగాయలు తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి పరారైంది. కొంతసేపు వేచి చూసిన వృద్ధురాలు మోసపోయానని గ్రహించి అదే రోజు రాత్రి కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ ఎం. చిరంజీవి తన బృందంతో కలిసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్, నంది కామన్ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితురాలి కదలికలను గుర్తించారు. బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా నిందితురాలిని సోమవారం ఉదయం కోరుట్ల బస్టాండ్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై జైలు శిక్ష అనుభవించినట్లు బయటపడింది. దొంగిలించిన బంగారు గొలుసును అదే రోజు నిజామాబాద్‌కు చెందిన స్వర్ణకారుడు ఆకుల ప్రసాద్‌కు విక్రయించి రూ.2.50 లక్షలు పొందినట్లు అంగీకరించింది.
పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ...
పోలీసులు నిందితురాలి వద్ద నుంచి రూ.2.03 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆకుల ప్రసాద్ వద్ద నుంచి బంగారు గొలుసును రికవరీ చేశారు. దొంగ సొత్తును కొనుగోలు చేసినందుకు ఆకుల ప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో విశేష కృషి చేసిన ఎస్ఐ చిరంజీవి, ఏఎస్ఐ రాజశ్రీ, హెడ్ కానిస్టేబుల్ లింబాద్రి, కానిస్టేబుళ్లు కిరణ్, రాజ్‌కిరణ్‌లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అభినందించారు. డీఎస్పీ ఏ. రాములు పర్యవేక్షణలో, సీఐ కె. లక్ష్మీనారాయణ మార్గదర్శకత్వంలో ఈ కేసు విజయవంతంగా ఛేదించబడింది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అపరిచితుల మాటలను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే దొంగ సొత్తు కొనుగోలు చేసే స్వర్ణకారులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.






