- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు హత్య కేసులో వీడిన మిస్టరీ.. ఎనిమిది మంది నిందితుల్లో ఇద్దరు మైనర్లు
ఉప్పు రమణారెడ్డి అనే యువకుడిని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో కలకలం రేపిన విషయం తెలిసిందే.

దిశ, కొడిమ్యాల (మల్యాల): ఉప్పు రమణారెడ్డి అనే యువకుడిని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతుడి సోదరుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధి లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ సోమవారం మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాలకు ప్రకారం.. కొండగట్టు ముత్యంపేటకు చెందిన ఉప్పు రమణారెడ్డి ఈనెల 2వ తేదీన అదే గ్రామానికి చెందిన బండి సిద్ధూ ఇంటి వద్ద జరుగుతున్న హల్ది ఫంక్షన్ కు వెళ్లి గొడవకు దిగాడు.
మళ్ళీ అదే రోజు సాయంత్రం రమణారెడ్డి మరోసారి బస్టాండ్ వద్ద గొడవకు దిగడంతో మాట్లాడుకుని సెటిల్ చేసుకుందామని సిద్దూ అతడి స్నేహితులు అయిన వినయ్, ఈశ్వర్ లు కొండగట్టు మెట్ల మార్గం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి రమణా రెడ్డి ని తీసుకువెళ్లారు. తర్వాత ముగ్గురు కలిసి కొట్టి హతమార్చి ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే గుంతలో పూడ్చిపెట్టినట్లుగా వివరించారు. ఈ హత్య కేసులో నిందితులకు దాసరి ఆకాష్, మంచినీళ్ల అజయ్, పంజాల మధు తో పాటు మరో ఇద్దరు మైనర్లు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు.
అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ కు తరలించగా వారి వద్ద నుండి తొమ్మిది సెల్ ఫోన్ లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు ఉప్పు రమణారెడ్డి పై ఇప్పటికే 24 పోలీస్ కేసులు ఉన్నాయని కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టగా గతంలో జైలుకు సైతం వెళ్లొచ్చాడని డీఎస్పీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మల్యాల సిఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






