​హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు.. 35 తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం..

by Kodari Anjali |

హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం పురపాలక సంఘ కార్యాలయంలో చైర్‌పర్సన్ సుహాసినీ రొంటాల అధ్యక్షతన జరిగింది.

​హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు.. 35 తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం..
X

దిశ, ​హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం పురపాలక సంఘ కార్యాలయంలో చైర్‌పర్సన్ సుహాసినీ రొంటాల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన మొత్తం 35 అభివృద్ధి అంశాలకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పట్టణ ప్రగతి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

​రూ. 60 లక్షలతో 30 వార్డుల అభివృద్ధి

​పట్టణంలోని మొత్తం 30 వార్డులలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి సాధారణ నిధుల నుంచి వార్డుకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 60 లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ నిర్ణయించింది.

​వసతుల కల్పన, వరద నివారణ చర్యలు...

​ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో వరద నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు, గుండ్ల చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు రూ. 1,98,000 సాధారణ నిధులతో నూతనంగా ఆర్ సి సి పైపులను కొనుగోలు చేయనున్నారు. మిషన్ భగీరథ నల్లా నీరు వృధా కాకుండా ఉండేందుకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ. 5,00,000 ఖర్చుతో నల్లాలకు బాల్ వాల్స్ అమర్చనున్నారు.

​వైకుంఠధామాల అభివృద్ధి...

పట్టణంలోని 14, 24 వార్డుల్లోని గ్రేవ్ యార్డుల అభివృద్ధికి రూ. 99,000 కేటాయించారు. అలాగే 1, 12, 13, 15 వార్డుల్లోని డి బి ఎం -16 కెనాల్ పక్కన గల స్మశాన వాటికలో బోర్ వెల్, మోటారు పంపు సెట్, స్నానాల ఘాట్ వంటి కనీస వసతుల కల్పనకు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది.

​ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు...

​కౌన్సిల్ సమావేశానికి ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ సుహాసినీ రొంటాల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి రోశయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలి, కమిషనర్ బి. కిషన్, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి జి. అభినవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, టీపీఎస్ శ్రీకాంత్, జూనియర్ అకౌంట్స్ అధికారి ఎస్. ఆర్తి, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ వినయ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story