- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్
"తెలంగాణ రాష్ట్రంలో మట్టి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీయే" అని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, గంగాధర : "తెలంగాణ రాష్ట్రంలో మట్టి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీయే" అని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మట్టి మాఫియా చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వి విధ్వంసానికి గురిచేసిందని మండిపడ్డారు. గురువారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. మట్టి తరలింపు పై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడడం చూస్తుంటే 'దొంగే దొంగ దొంగ' అన్నట్లుగా ఉందని ఆంజనేయులు గౌడ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అప్పటి ఎమ్మెల్యేలు బొడిగె శోభ, సుంకె రవిశంకర్‌లు చెరువు మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వరద కాలువ మట్టిని అమ్ముకోవడమే కాకుండా, పెట్రోల్ బంకుల వద్ద డబ్బులు వసూలు చేసిన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో పనిచేసిన పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్ల వద్ద డబ్బులు వసూలు చేసింది రవిశంకర్ కాదా? అని ఆయన నిలదీశారు. చివరికి కుల సంఘాల భవనాలకు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా కమీషన్లు వసూలు చేసిన ఘోర చరిత్ర రవిశంకర్‌ది అని ధ్వజమెత్తారు.
ప్రస్తుత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కడిగిన ముత్యం లాంటి వాడని ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాదిరిగా అధికారుల వద్ద డబ్బులు వసూలు చేసే అలవాటు మేడిపల్లికి లేదని, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎలాంటి కమీషన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి వందల కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత, పేద విద్యార్థుల కోసం గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించిన గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అని కొనియాడారు. ఇంకొకసారి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యుడు సత్తు కనుకయ్య, సర్పంచులు వేముల భాస్కర్, దాసరి శంకరయ్య, కాంగ్రెస్ నాయకులు కొలిపాక స్వామి, పడాల రాజన్న, కర్ర విద్యాసాగర్ రెడ్డి, రేండ్ల రాజిరెడ్డి, గునుకొండ బాబు, అట్లా శేఖర్ రెడ్డి, ఆరే రాజశేఖర్, దీకొండ మధు, గుడి ప్రవీణ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మంత్రి మహేందర్ పాల్గొన్నారు.






