- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నేతలపై కక్షపూరితంగా సీఎం రేవంత్ వ్యవహారం.. ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాల జిల్లాలో ఆమె పర్యటించి, పట్టణంలోని నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తుండగా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఈ విఫలతలపై ప్రజల నుండి వస్తున్న ఒత్తిడిని తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతలపై నోటీసుల పేరుతో దృష్టి మళ్లింపుదిశగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇదివరకే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు జారీ కాగా, కేటీఆర్‌కు ఇప్పటికే ఆరు సార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
తాము ఏ తప్పూ చేయలేదని స్పష్టంగా చెబుతూ, వచ్చిన ప్రతి నోటీసుకు సమగ్రంగా స్పందిస్తామని చెప్పారు. కేటీఆర్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, తెలంగాణ భవన్‌కు తాళాలు వేసి కార్యకర్తలను నిర్బంధించడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేస్తూ, లోపాలపై చర్చించుకుని పరిష్కరించుకునే శక్తి తమకు ఉందని కవిత చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






