కరీంనగర్ పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు.. మరో సాంకేతిక అడుగు

by Bhanu |

కరీంనగర్ పోలీసులు విధినిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కొత్తగా బాడీ వార్న్ కెమెరాలను వినియోగించేందుకు సిద్ధమయ్యారు.

కరీంనగర్ పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు.. మరో సాంకేతిక అడుగు
X

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ పోలీసులు విధినిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కొత్తగా బాడీ వార్న్ కెమెరాలను వినియోగించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు నేరస్థులను అదుపులోకి తీసుకునే సమయంలో లేదా ప్రజా కార్యక్రమాల్లో ఎదురయ్యే అపార్థాల్ని నివారించేందుకు ఈ కెమెరాలు కీలకంగా మారనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా, రాజకీయ పార్టీల ఆందోళనల సమయంలో పోలీసులు తీసుకునే చర్యలపై విపక్షాల ఆరోపణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, నిజానిజాలను రికార్డు చేయడానికే ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు.

ఆరోపణలకు చెక్.. పారదర్శక విధానానికి శ్రీకారం

ఇటీవల కాలంలో పోలీసులపై అసత్య ఆరోపణలు పెరుగుతున్న పరిస్థితుల్లో, పోలీస్ కమీషనర్ గౌస్ అలాం ఆ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బాడీ వార్న్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేరం జరిగే సమయంలో అక్కడి పరిస్థితులన్నీ రికార్డవుతుండటంతో నిజాలు వెలుగులోకి రానున్నాయి. ఇది పోలీసులపై నమ్మకాన్ని పెంచడమే కాక, విధుల్లో ఉన్న సిబ్బందికి రక్షణగా కూడా నిలవనుంది.

తప్పు చేసినా కెమెరా చూస్తోంది.. జాగ్రత్తే మంచిది

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీసులు ఇకపై నడుముకు తుపాకీ, చేతిలో లాఠీ, వాకిటాకీతో పాటు యూనిఫామ్‌కు కట్టిన బాడీ వార్న్ కెమెరాతో రంగంలోకి దిగనున్నారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించేవారైనా, తప్పుడు ఆరోపణలు చేయాలని చూస్తేనా , కెమెరా సాక్షిగా నిజాలు వెలుగులోకి వచ్చేస్తాయి. ఇది నేరస్థులకు హెచ్చరికగా మారనుంది.

Next Story