- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ మార్కెట్‌ను రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి తుమ్మల
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు.

దిశ, కొత్తపల్లి: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. రైతుల అభ్యున్నతి, మార్కెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఆకుల నరసయ్య రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించిన ఆకుల నరసయ్య, తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రులు ఆకుల నరసయ్యకు అభినందనలు తెలిపారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ రైతులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో మార్కెట్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మార్కెట్ యార్డులో ఆధునిక సౌకర్యాల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెలిచాల రాజేందర్ రావు సహకారంతో కరీంనగర్ మార్కెట్‌ను రాష్ట్రంలోని ఇతర మార్కెట్లకు ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైన నిధులు, పరిపాలన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని మంత్రులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. కరీంనగర్ మార్కెట్‌ను ఆధునికీకరించి రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతులకు అండగా నిలుస్తామని, వారి సంక్షేమంలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు నిష్పక్షపాతంగా నిజాయితీగా సేవలందిస్తామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య మాట్లాడుతూ.. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా మార్కెట్ వ్యవహారాలను నడిపిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ మార్కెట్‌లో మౌలిక సదుపాయాల విస్తరణ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, రైతులకు విశ్రాంతి గదులు, తాగునీరు, పారదర్శక తూకం వ్యవస్థ, డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై మంత్రులతో వెలిచాల రాజేందర్ రావు చర్చించారు. ఆయా అంశాలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.






