- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరీఫ్ సీజన్‌కు రైతులు సన్నద్ధం.. యూరియా సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష
ఖరీఫ్ సీజన్ సన్నాహాల్లో భాగంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ (Kharif Season)ను దృష్టిలో ఉంచుకుని అన్నదాతలకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వివిధ రసాయన ఎరువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు జరిగిన ఎరువుల కేటాయింపులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు వివిధ కంపెనీల నుంచి రాష్ట్రానికి చేరుకున్న యూరియా నిల్వలు, జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. కంపెనీలు తమకు కేటాయించిన కోటాను సకాలంలో రాష్ట్రానికి చేరవేయాలని మంత్రి ఆదేశించారు.
నానో యూరియాపై రైతుల్లో అవగాహన పెంచాలి..
సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా (Nano Urea) వాడకాన్ని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు క్షేత్రస్థాయిలో వివరించాలని పేర్కొన్నారు. దీంతో రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుందని, భూసారం దెబ్బతినకుండా ఉంటుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎరువుల రవాణా, పంపిణీలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని, బ్లాక్ మార్కెట్ (Black Market)పై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువుల లభ్యతపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేసి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.






