- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరం : ఎమ్మెల్యే సంజయ్
బొర్నపల్లి - జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణ విషయంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు.

దిశ, జగిత్యాల టౌన్: బొర్నపల్లి - జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణ విషయంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (లక్ష్మణ్ కుమార్) ను కలిసి బొర్నపల్లి బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని వినతిపత్రం ఇచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కేంద్ర మంత్రి జువెల్ ఓరం, ఎంపీ అరవింద్, సీఎం రేవంత్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి ఈ బ్రిడ్జి ప్రతిపాదనలు కేంద్రానికి పంపడంలో తాను కీలక పాత్ర పోషించానని గుర్తుచేశారు. మునుపటి కాంట్రాక్టర్లు పనులు వదిలేయడంతో వెంటనే రీ-టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే 2012లో నాటి మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి బొర్నపల్లి బ్రిడ్జికి రూ. కోటి మంజూరయ్యాయని గొప్పగా చెప్పారని, అసలు ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కలిసి పని చేసినట్లు ఇప్పుడు కూడా ఎంపీ అరవింద్, జీవన్ రెడ్డిలు లోపాయికారీ ఒప్పందం తో పనిచేస్తున్నారా అని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 'పీఎం జన్మన్' పథకం కింద ఇవ్వాల్సిన నిధులపై సీనియర్ నేత ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్‌ఎస్ కుటుంబాన్ని విమర్శించిన నాయకులు.. నేడు రహస్య ఒప్పందాల్లో భాగంగానే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ అండ్ బి మంత్రిగా ఉండి కూడా బొర్నపల్లి, ఇటిక్యాల, రామాజీపేట్, కోనాపూర్ బ్రిడ్జిలను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ వాణి, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, రాయికల్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు మరియు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






