మున్సిపల్ టికెట్ల పంపిణీ పై జీవన్ రెడ్డి అసంతృప్తి..!

by Ratna Kumari |

స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు.

మున్సిపల్ టికెట్ల పంపిణీ పై జీవన్ రెడ్డి అసంతృప్తి..!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు.

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఇటీవల పార్టీలోకి వచ్చిన వలసవాదులకూ మధ్య పోటీ జరుగుతోందని ఆరోపించారు. జీవితంలో కాంగ్రెస్ జెండా పట్టనోడికి పార్టీ బీఫాం ఇచ్చారు. రాయికల్ మున్సిపాలిటీలో కూడా నాకు, నా కార్యకర్తలకు అన్యాయం జరిగింది అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తల హక్కులు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నేను చేసిన తప్పేంటి… పాపం ఏంటి ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై రెండు సార్లు పోటీ చేసిన వ్యక్తిని నేనని గుర్తు చేశారు. గాంధీ భవన్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తే ప్రశ్నిస్తే అదే నా తప్పయ్యిందా?” అని అన్నారు. తనపై ఉన్న కోపంతో కార్యకర్తలకు అన్యాయం చేశారు” అంటూ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జై బాపు… జై భీమ్… జై సంవిధాన్ అంటూ రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్ర చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు అని విమర్శించారు. తనకు అన్యాయం జరిగితే భరించగలనని కానీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం సహించనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు టికెట్ వస్తే నేను వ్యతిరేకంగా ప్రచారం చేయను.సింబల్ కేవలం ఐడెంటిటీ మాత్రమే అంటూ కార్యకర్తల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాను అని తెలిపారు. కాలమే ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

Next Story